నామినేటెడ్‌ ఆశలు | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ ఆశలు

Mar 18 2026 7:42 AM | Updated on Mar 18 2026 7:42 AM

ఈ నెలలో పదవుల పంపిణీ

పూర్తి చేసే అవకాశాలు

తాజాగా డాక్టర్‌ కవితారెడ్డికి దక్కిన

రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి

అలర్ట్‌ అయిన ఆశావహులు..

హైదరాబాద్‌లో మకాం

నాయకులను, శ్రేణులను మూడు

కేటగిరీలుగా విభజించినట్లు వార్తలు

ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డికి

ఆర్టీసీ చైర్మన్‌ దక్కే చాన్స్‌!

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నామినేటెడ్‌ పదవులను పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ఈ నెలలో కాంగ్రెస్‌ నాయకత్వం రంగం సిద్ధం చేస్తుండడంతో జిల్లాకు చెందిన ఆశావహులు మరింత అలర్ట్‌ అయ్యారు. పదవులు ఆశిస్తున్న నాయకులు హైదరాబాద్‌లో మకాం వేసి తమ స్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక పదవుల్లో ఉన్నవారిని కలిసి తమకు పదవులు కేటాయించేలా చూడాలని అడుగుతున్నారు. పూర్తిగా హైదరాబాద్‌లోనే ఆయా ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. కాగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్‌ శ్రేణులను మూడు కేటగిరీలుగా విభజించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో దీనిపై చర్చ జరుగుతోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, గత శాసనసభ ఎన్నికలకు ముందు వచ్చినవారు, పార్టీ అధికారంలోకి వచ్చినవారు అనే మూడు కేటగిరీలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడు కేటగిరీల వారు ఆయా లెక్కల ఆధారంగా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పటికే పదవుల కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూస్తున్న నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు మీనాక్షిపార్టీ అధినాయకత్వానికి నివేదిక సైతం ఇవ్వడం గమనార్హం. ఇక జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడుగా మహేశ్‌గౌడ్‌ ఉండడంతో ఆశావహుల నుంచి ఆయనపై ఒత్తిడి ఎక్కువగా ఉంది.

పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న డాక్టర్‌ కవితారెడ్డికి జిల్లా నుంచి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌గా నామినేటెడ్‌ పదవి కేటాయించడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇదే క్రమంలో మిగిలిన ఆశావహులకు సైతం పదవుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొందరు ఎమ్మెల్యేలకు సైతం కీలక కార్పొరేషన్‌ పదవులు ఇ వ్వనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ రూరల్‌ ఎ మ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డికి కీలకమైన ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇవ్వనున్నట్లు జిల్లా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా జిల్లాల వారీగా నామినేటెడ్‌ పదవులు ఎవరికి ఇవ్వాలనే విషయమై ఇప్పటికే జాబితా రూపొందించినట్లు సమాచారం. ఇందులో యువ నాయకులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

రేసులో..

మాజీ డీసీసీబీ చైర్మన్‌ కుంట రమేష్‌ రెడ్డి మరోసారి ఆ పదవిని ఆశిస్తున్నారు. సహకార పదవులు సైతం నామినేటెడ్‌ పద్దతిలో ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై భారీ చర్చ నడుస్తోంది. డీసీసీ పీఠం ఆశించి విఫలమైన సీనియర్‌ నాయకుడు మార చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవి రేసులో ఉన్నారు. అదేవిధంగా మరో సీనియర్‌ నాయకుడు బాడ్సి శేఖర్‌గౌడ్‌ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి రేసులో ఉన్నారు. శేఖర్‌గౌడ్‌కు గీత కార్మిక కార్పొరేషన్‌ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ మునిపల్లి సాయిరెడ్డి, పురణ్‌రెడ్డి సైతం నామినేటెడ్‌ రేసులో ఉన్నారు. మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌, బాస వేణుగోపాల్‌యాదవ్‌, వెల్మ భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాటిపల్లి నరేందర్‌రెడ్డి, నరాల రత్నాకర్‌ పదవుల రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో జుక్కల్‌ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌ సైతం రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు.

నామినేటెడ్‌ పదవుల నియామకానికి అధిష్టానం కసరత్తు చేస్తోందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే నాయకులు, కార్యకర్తలను అధిష్టానం మూడు కేటగిరీలుగా విభజించిట్లు సమాచారం. ముందు నుంచి పార్టీలో ఉన్నవారు, అసెంబ్లీ ఎలక్షన్స్‌కు ముందు వచ్చిన వారు, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేరిన వారి పేర్లతో జాబితాలు చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement