కొత్త పట్టాదారులకూ భరోసా | - | Sakshi
Sakshi News home page

కొత్త పట్టాదారులకూ భరోసా

Mar 18 2026 7:42 AM | Updated on Mar 18 2026 7:42 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు మరో తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కొత్త పట్టా పాస్‌పుస్తకాలు పొందిన రైతులు కూడా ‘రైతు భరోసా’ పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం తగిన పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో ఏఈవోలకు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో మరికొంత మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కటాఫ్‌ తేదీ ప్రకారం జిల్లాలో కొత్త పట్టాదారు పుస్తకాలు పొందిన వారు 4,616 మంది ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులు మార్చి 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాత రైతులతోపాటు కొత్త రైతులకు కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ.6వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. కొత్త పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేలా వ్యవసాయాధికారులు వాట్సాప్‌ గ్రూపుల్లో, స్టేటస్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. రైతు భరోసా నిధులను ప్రభుత్వం చివరిసారిగా వానాకాలం–2025లో ఇవ్వగా జిల్లాలో 2.72లక్షల మంది రైతులకు రూ.316.63కోట్లు ఖర్చు చేసింది.

అర్హతలు.. అవసరమైన పత్రాలు

ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొత్త పట్టా పాసుబుక్‌ పొందిన వారు అర్హులు

పట్టా పాస్‌బుక్‌ ఉండి ఇప్పటి వరకు రైతు భరోసా పొందని రైతులు

రైతు భరోసా అప్లికేషన్‌ ఫారం

పట్టాదార్‌ పాస్‌పుస్తకం జిరాక్స్‌

రైతు ఆధార్‌కార్డు

బ్యాంకు ఖాతా జిరాక్స్‌

రైతు మొబైల్‌ నంబర్‌

సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కటాఫ్‌ తేదీ వరకు కొత్త పట్టాపా స్‌ పుస్తకాలు పొందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. యాసంగికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు రావాలంటే కొత్త రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. రైతుల్లో వేదికల్లో ఏఈవోలను, ఏవోలను సంప్రదిస్తే వారు మరిన్ని వివరాలు తెలుపుతారు.

– గోసుల వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి

ఫిబ్రవరి 28 నాటికి పాస్‌పుస్తకాలు

పొందిన వారికి అవకాశం

దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు

లబ్ధి పొందనున్న

4,616 మంది రైతులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement