నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలో ఉన్న ఇందూరు తిరుమలలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు అయిన ఆదివారం ఆలంయలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా పూర్ణాహుతి నిర్వహించి అనంతరం స్వామి వారి రథోత్సవం వైభవంగా చేపట్టారు. ఆలయ మాడవీధుల్లో భక్తులు రథాన్ని లాగగా, వేలాది మంది కదిలివచ్చారు. గోవింద నామస్మరణతో మాడవీధులు పులకించిపోయాయి. దిల్‌రాజు సోదరుడు శిరీష్‌రెడ్డి నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి స్వామి వారి రథాన్ని లాగుతు ముందుకు నడిచారు. నర్సింగ్‌పల్లి గ్రామ మహిళలు హారతులు పట్టుకొని స్వామి వారికి స్వాగతం పలుకుతూ దారి వెంట నృత్యాలు చేసుకుంటూ నడిచారు. రథోత్సవం అనంతరం స్వామి వారికి చక్రస్నానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పుష్కరిణిలో స్వామి వారికి చక్ర స్నాన కార్యక్రమాన్ని దేవనాథ జియర్ స్వామి వారు, యాజ్ఞాచార్యులు, వేద పండితులు, అర్చకులు నిర్వహించారు.
పుష్కర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. మహా పూర్ణాహుతి అనంతరం త్రిదండి దేవనాథ జియర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. భగవంతునిపై ప్రేమతో సేవలు చేస్తున్న ఇందూరు తిరుమల ఇలలో వైకుంఠంగా మారడం ఖాయమని వారు అన్నారు. మనుషులు సదా భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని అన్నారు. భగవంతుడు లోక కార్యం మనుషుల ద్వారా చేస్తారని, భగవంతుడి కృష వల్లనే మనిషి గొప్పగా ఎదుగుతాడని అన్నారు. భగవంతుడు మనల్ని ఎంచుకునేందుకు అర్హత సాధించాలని, మనిషి లోపల భూత దయ, ప్రకృతిపై ప్రేమ, దేశ భక్తి ఉండాలన్నారు. కలియుగంలో హరి నామమే మోక్ష మార్గం కావున ప్రతి క్షణం హరి నామం జపిస్తూ ఉండాలని అన్నారు. తాను మోక్ష మార్గాన్ని అనుసరిస్తు సాటి మనిషికి కూడా మోక్ష మార్గాన్ని చూపెట్టాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహా రెడ్డి దంపతులు, సుదర్శన్ రెడ్డి దంపతులు, ఎంపీటీసీ రాములు, ఫొటో గంగాధర్, ప్రవీణ్, పృథ్వి నారాయణ, నర్సారెడ్డి, నరాల సుధాకర్, రమేశ్ భాస్కర్, నరేందర్, రాజేశ్వర్, సాయిలు, గంగారెడ్డి, ప్రమోద్, భూంరెడ్డి, యాజ్ఞాచార్యులు, అనంత ఆచార్యులు, రోహిత్ కుమారాచార్యా విజయ్ స్వామి, అనిల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.


