జీపీ ఖాతా
డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామ పంచాయతీ
డొంకేశ్వర్ మండలంలోని జీపీలకు ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. దత్తాపూర్, కోమట్‌పల్లి, మారంపల్లి, గాదేపల్లి, గంగాసముందర్, జీజీ నడ్కుడ గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ ఈఎంఐలను పెండింగ్‌లో ఉంచడంతో బ్యాంకర్లు ఆ జీపీల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ట్రాక్టర్ కిస్తీలను ఒకేసారి చెల్లిస్తేనే ఖాతాలను మళ్లీ ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. సర్పంచులకు వేరే మార్గం లేకపోవడంతో సరే అన్నారు. వచ్చిన నిధుల్లో సగం ట్రాక్టర్ల ఈఎంఐలకు పోగా మిగిలిన వాటితో పాత బకాయిలు, జీపీ సిబ్బంది జీతాలు చెల్లించారు. దీంతో పంచాయతీ ఖాతాలు మళ్లీ ఖాళీ అయ్యాయని, కొత్త పనులు ఎలా చేపట్టాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. రెండేళ్ల తర్వాత వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు రోజులు కూడా పంచాయతీ ఖాతాల్లో నిలువలేదు. మూడు విడతల్లో వచ్చిన నిధులు చేతికి అందకముందే పాత బకాయిల రూపంలో ఖర్చయిపోవడంతో పంచాయతీ ఖాతాలు మళ్లీ ఖాళీ అయ్యాయి. గ్రామాల్లో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల నెలవారీ వాయిదాలు పెండింగ్‌లో ఉండడంతో బ్యాంకర్లు జమ చేసుకున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు చేసిన వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఇందులో నుంచే చెల్లించారు. కాగా, జీపీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు సైతం ఇవే నిధుల నుంచి ఖర్చు చేశారు. ప్రస్తుతం వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, మోటార్ల కరెంట్ బిల్లు, రిపేర్లు, కొత్త పనుల కోసం నిధులు లేకపోవడంతో సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. వచ్చిన నిధులు వచ్చినట్లుగా పాత బకాయిలకే పోవడంతో చిన్న గ్రామ పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మళ్లీ నిధులు వచ్చే వరకు పంచాయతీలను ఎలా నడుపాలో సర్పంచులకు పాలుపోవడం లేదు. కార్యదర్శులకు కూడా పాత బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే జీపీలకు మూడు సార్లు నిధులివ్వగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా ఇవ్వలేదు.
అప్పులకే సరిపోయిన
15వ ఆర్థిక సంఘం నిధులు
ట్రాక్టర్ కిస్తీలు,
పాత బకాయిలకు సర్దుబాటు
నిధులు లేవని
కొత్త సర్పంచుల ఆవేదన


