మోర్తాడ్(బాల్కొండ): మంచినీటిని సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మిషన్ భగీరథ ఆపరేటర్లకు కాంట్రాక్టు కంపెనీ ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. మూడు సంవత్సరాలుగా సరిగా వేతనాలు చెల్లించడం లేదని సదరు కంపెనీ తీరుపై ఆపరేటర్లు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో బిల్లులు మంజూరు కావ డం లేదనే సాకు చూపుతున్న కాంట్రాక్టు కంపెనీలు ఆపరేటర్లకు వేతనాలు చెల్లించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
మిషన భగీరథ పంప్‌హౌస్‌లు, సంప్‌హౌస్‌లు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. కేవలం నీటి సరఫరా, అజమాయిషీ చేసే బాధ్యతను గత ప్రభుత్వం కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు పొందిన కంపెనీలు ఆపరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించుకుని వారి ద్వారా ఇంటింటికి రోజూ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 600 మంది వరకు పని చేస్తున్నారు. ఆపరేటర్లకు సీనియారిటీని బట్టి రూ.8వేల నుంచి రూ.10వేల వరకు, సూపర్‌వైజర్లకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. పీఎఫ్‌ను కూడా జమ చేయాల్సి ఉంది. పీఎఫ్‌ను జమ చేస్తున్నా వేతనాల విషయంలో మాత్రం మొదటి నుంచి నిర్లక్ష్యమే జరుగుతోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులతో సంబంధం లేకుండానే కంపెనీలు తమతో ఒప్పందం చేసుకున్న ఆపరేటర్లకు ప్రతినెలా వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలి. కానీ ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో రెండు రోజుల కింద ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మిషన్ భగీరథ సిబ్బందికి న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ఏడు నెలలుగా పెండింగ్..
బిల్లులు రావడం లేదనే సాకుతో జీతాలివ్వని కాంట్రాక్టు కంపెనీ
చెల్లింపుల్లో మొదటి నుంచి నిర్లక్ష్యమే..


