● ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్రాల అఖిల
భారతీయ సమ్మేళనంలో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ క్షేత్రాల అఖిల భారతీయ సమన్వయ సదస్సు హర్యానాలో జరుగుతోంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో సంఘ్ అన్ని శాఖలకు చెందిన అఖిల భారత అధ్యక్ష, కార్యదర్శులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇందులో ఇందూరు నగరానికి చెందిన అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షులు కొండెల సాయిరెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కలిసి ఒకే వరుసలో పాల్గొన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అఖిల భారత అధ్యక్ష స్థాయికి ఎదిగిన అత్యంత సాధారణ కార్యకర్తలు ఇద్దరు కలిసిన అరుదైన దృశ్యం జిల్లా సంఘ్ శ్రేణుల్లో సంతోషం నింపింది.
ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్ గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్లి బాధితులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు ధర్పల్లి మండల కేంద్రంలో ఈ నెల 11న జరిగిన జారూపల కాంతామణి హత్య కేసుకు సంబంధించి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఏసీపీ వెంట సీఐ భిక్షపతి, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని ప్రెస్‌కాలనీలో నివాసముండే పట్లోళ్ల సుగుణ ఇంట్లో గతేడాది ఆగస్టు 5న చోరీకి పాల్పడిన నిందితుడిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. సుగుణ తన ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టబడి ఉన్నాయి. ఇంట్లో దాచిన రూ.రెండున్నల లక్షలు అపహరణకు గురికావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆరు నెలల తర్వాత నిందితుడు దండుగల ఎల్లప్ప తాడ్కోల్ శివాజీ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు. ప్రెస్‌కాలనీలో చోరీకి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, అతని వద్ద నుంచి రూ.45వేల విలువ చేసే ట్యాబ్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ తుల శ్రీధర్ తెలిపారు.


