● వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు
కామారెడ్డి క్రైం: జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దేవునిపల్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మండలం వడ్లూర్ గ్రామానికి చెందిన వద్దే పద్మ గత నెల 22న ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లగా దుండగులు చోరీకి పాల్పడ్డారు. సమీపంలోని మరో ఇంట్లోకి సైతం చొరబడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం టేక్రియాల్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల్లో ఒకరు సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన నూనె నర్సింలు కాగా మరొకరు మైనర్‌గా గుర్తించారు. వీరిద్దరూ మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారని విచారణలో తేలింది. నిందితుల నుంచి 40 తులాల వెండి, 15 కిలోల రాగి వైర్, ద్విచక్రవాహనం, రూ.4,500 నగదు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడు నర్సింలుపై గతంలో శామీర్‌పేట, సిద్దిపేట, రాయిపోల్, తోగుట, కుకునూర్, పీఎస్‌లలో పలు దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీఐలు, ఎస్సైలు, సిబ్బందిని అభినందించారు.


