న్యూస్‌రీల్
విద్యార్థులకు విద్యాబోధన.. అధికారులకు చురకలు
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
– 8లో u
సంపూర్ణ అక్షరాస్యత నా కల.. అని చెప్పే కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి కీలకమైన విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కృషి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేజీబీవీలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఝలక్ ఇస్తున్నారు. వేర్వేరు కారణాలతో ఇప్పటికే ఆరుగురిపై సస్పెన్షన్ వేటు పడగా, ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
ఖలీల్‌వాడి: జిల్లాలోని కేజీబీవీలు, గురుకులాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. విద్యాలయాల నిర్వహణలో లోపాలను గుర్తించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఏ పాఠశాలకు వెళ్లిన ముందు గా నిర్వహణ, రికార్డులను పరిశీలిస్తున్నారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి పాఠాలు బోధిస్తూ విద్యార్థుల్లోని అభ్యసన సామర్థ్యాలను గుర్తిస్తున్నారు. విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కలెక్టర్ విద్యా వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు సంబంధిత అధికారులు, సిబ్బంది హడలెత్తుతున్నారు. దీంతో చేసేది లేక డుమ్మా టీచర్లు, సిబ్బంది స్కూల్ బాట పడుతున్నారు. గతేడాది డిసెంబర్ 31న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనిఖీలతో హడలెత్తిస్తూ ఇప్పటి వరకు ఆరుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
● జనవరి 28న ఎన్నికల విధులకు గైర్హాజరైన ఆర్మూర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రఽధానోపాధ్యాయురాలు వనజారెడ్డిపై సస్పెన్ష న్ వేటు వేశారు.
● జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడలో ఉన్న ఎస్సీ స్టడీ సర్కిల్, సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ ఫిబ్రవరి 8న ఆటోలో సుమారు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన సాంఘిక సంక్షేమశాఖ అధికారులు కలెక్టర్‌కు నివేదిక అందించగా ఆయనను సస్పెండ్ చేశారు.
● మార్చి 4న ఇందల్వాయిలోని ఏకలవ్వ గురుకుల పాఠశాల విద్యార్థి రామ్‌చరణ్(15) ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ నివేదిక అందుకున్న కలెక్టర్.. ప్రిన్సిపాల్‌తోపాటు ముగ్గురిని సస్పెండ్ చేశారు.
● మార్చి 9న బాల్కొండ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ త్రిపాఠి తనిఖీ చేశారు. కేర్‌టేకర్ విద్యార్థులతోపాటు టీచర్లు, సిబ్బందిపై దురుసుగా ప్రవ ర్తిస్తున్నారని తేలడంతో ఆమెను విధుల నుంచి తొలిగించారు.
● మార్చి 11న నవీపేట్ మండలంలోని మోకన్‌పల్లి కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి లోపాలను గుర్తించారు. స్పెషల్ ఆఫీసర్ కవిత, బోధన విధుల్లో కొనసాగుతున్న రాజశ్రీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యతోపాటు ఆరోగ్యంపై..
విద్యాలయాలను తనిఖీ చేస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్య ఎదురైనా ఇబ్బంది పడకుండా క్లాస్ టీచర్‌కు లేదా స్కూల్‌లోని మెడికల్ సిబ్బందికి తెలుపాలని సూచిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత ప్రాధాన్యతను వివరిస్తున్నారు.
పాఠాలు చెబుతున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి(ఫైల్)
పరీక్ష కేంద్రాల తనిఖీలు
పరీక్షలు కొనసాగుతున్న వేళ సెంటర్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. పరీక్ష సెంటర్లలో కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని గుర్తించి ఇప్పటికే సంబంధిత అధికారుల తీరును ఎండగట్టారు. ఎగ్జామినేషన్ సెంటర్లలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా.. కలెక్టర్ ఎప్పుడు ఏ సెంటర్‌ను తనిఖీ చేస్తారోనని తెలియడం లేదని సంబంధిత అధికారులు చర్చించుకుంటున్నారు.
పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై దృష్టి సారిస్తే..
జిల్లాలో 44 ప్రభుత్వ పాఠశాలలు పీఎంశ్రీ కింద ఎంపికయ్యాయి. ప్రతి పాఠశాలకు రూ.10 నుంచి రూ.13 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయి. అయితే నిధుల దుర్వినియోగంపై విద్యాశాఖకు ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఏంఈవోలతో విచారణ చేపట్టి నివేదికను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఫైలు జిల్లా విద్యాశాఖలో పెండింగ్‌లో ఉంది. కలెక్టర్ దృష్టి సారించి నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
ఇప్పుటి వరకు ఆరుగురి సస్పెన్షన్, ఇద్దరికి షోకాజ్ నోటీసులు
కేజీబీవీలు, గురుకులాలు,
ప్రభుత్వ పాఠశాలల తనిఖీలు
విద్యావ్యవస్థను గాడిలో పెడుతున్న
కలెక్టరమ్మ
క్షేత్రస్థాయిలో చిన్నారులతో
మమేకమవుతున్న ఇలా త్రిపాఠి


