మోర్తాడ్(బాల్కొండ): ఇరాన్ – ఇజ్రాయిల్ యు ద్ధం ప్రభావం పసుపు రైతులపై పడుతోంది. ఎగుమతులు నిలిచిపోవడంతో మార్కెట్‌లో డిమాండ్ లేదని వ్యాపారులు అంటున్నారు. వారం, పది రోజుల కింద ఊరించిన పసుపు ధర ఒక్కసారిగా క్వింటాల్‌కు రూ.2వేలు తగ్గడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. పసుపు క్రయవిక్రయాలు ప్రారంభమైన నాటి నుంచి మార్కెట్లో పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో ఈసారి లాభాల పంట పండుతుందని రైతులు ఆశించారు. అయితే యుద్ధం పరిస్థితులు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. నిజామాబాద్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.14వేల నుంచి రూ.15,500 వరకు పలికిన ధర ఇప్పుడు రూ.9,500 నుంచి రూ.13,500కు తగ్గిపోయింది. సాంగ్లీ మార్కెట్‌లో రూ.16వేల నుంచి రూ.17వేలు ధర పలకగా.. ఇప్పుడు రూ.13వేలకు పడిపోయింది. జాతీయ మార్కెట్ కావడంతో సాంగ్లీ వచ్చి బడా వ్యాపారులు పసుపు కొనుగోలు చేస్తారు. అయితే యుద్ధం కారణంగా పొరుగు దేశాలకు ఎగుమతులు నిలచిపోయాయని, ఒక దశలో పసుపుతో విదేశాలకు పయనమైన ఓడలు వెనక్కి వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. యుద్ధం ఎక్కువ కాలం ఉండేది కాదని, మన పసుపునకు విదేశాల్లో డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులే కావాలని ధర తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించుకుని లాభాలు గడించాలని ఆశతో ఇలా చేస్తున్నారని అంటున్నారు.
సీజన్ ముగింపు దశలో ధర పెరగాలి
సీజన్ ముగింపు దశలో పసుపు ధర పెరగాలి. గతంలో సాంగ్లీలో లభించిన విధంగానే నిజామాబాద్‌లో ధర లభిస్తుందని తీసుకువచ్చాం. యుద్ధం కారణంగా ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. లాభాలు తగ్గిపోవడమే కాదు మా శ్రమ వృథా అవుతుంది.
– పెద్దకాపు శ్రీనివాస్, రైతు, దోంచంద
ఎంతో ఆశతో సాంగ్లీకి తరలించాం
సాంగ్లీ మార్కెట్‌లో నాణ్యమైన పసుపునకు డిమాండ్ ఉంటుందనే ఆశతో తీసుకెళ్లాం. క్వింటాల్‌కు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు ధర తగ్గిపోవడంతో మాకు రవాణా చార్జీలు కూడా భారమవుతున్నా యి. యుద్ధం కారణంగా పసుపు ధరలు పడిపోయాయని వ్యాపారులు చెప్పడం కుట్రగానే భావిస్తున్నాం.
– రవి, రైతు, దొన్కల్
ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ !
ఎగుమతులు నిలిచిపోవడంతోనే
డిమాండ్ లేదంటున్న వ్యాపారులు
క్వింటాల్‌కు రూ.2వేల వరకు తగ్గిన ధర
సాంగ్లీ మార్కెట్‌లోనూ
ప్రతికూల పరిస్థితులు


