● ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటేనే
సిలిండర్ ఇస్తామంటున్న ఏజెన్సీలు
● మూడు రోజుల నుంచి
పరిష్కారం కాని సమస్య
మోర్తాడ్(బాల్కొండ): ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తుందనే ప్రచారానికి స్థానికంగా క్షేత్రస్థాయి పరిస్థితులు తోడవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. వంట గ్యాస్ సరఫరాపై కేంద్ర పెట్రోలియం శాఖ, పౌర సరఫరాల శాఖ నిబంధనలను కఠినతరం చేయడంతో వినియోగదారులు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. సర్వర్ బిజీ కారణంగా ఆన్‌లైన్‌లో, వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ కావడం లేదు. దీంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటేనే గ్యాస్ వస్తుందని ఏజెన్సీల నిర్వాహకులు స్పష్టం చేస్తుండడంతో వినియోగదారులు ఆగ్రహానికి గురవుతున్నారు. రెండు, మూడు రోజుల నుంచి ప్రతి కంపెనీ గ్యాస్ బుకింగ్ టోల్‌ఫ్రీ నంబర్లు పని చేయడం లేదు. మూడు రోజుల నుంచి సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడం అది పరిష్కారానికి నోచుకోవడం లేదు. అనేక మంది ఒకే సమయంలో గ్యాస్ బుకింగ్ కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగిస్తుండటంతో సర్వర్ బిజీగా ఉంటోందని అధికార యంత్రాంగం చెబుతోంది. వంట గ్యాస్ కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందొద్దని చెబుతున్నా గ్యాస్ బుకింగ్ కష్టాలు మాత్రం తప్పడం లేదు.


