నిజామాబాద్ అర్బన్: గ్యాస్ కొరత నెలకొందనే వదంతుల నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల పరిశీలన కోసం స్వయంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ శిల్పా ఎంటర్ ప్రైజెస్, జాఫ్రాన్ హౌస్ మల్టీ కుషన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ ఏజెన్సీలో ఆన్‌లైన్ బుకింగ్ వివరాలు పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. గ్యాస్ కొరత వదంతులతో బుకింగ్‌లు పెరిగాయని నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా చూడాలన్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు కాల్ చేయాలని సూచించారు. అనంతరం రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు. వండేందుకు వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను పరిశీలించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్‌వో అరవింద్ రెడ్డి తదితరులు ఉన్నారు.


