తెయూ(డిచ్‌పల్లి): నైపుణ్యం, పోటీతత్వం విజయానికి సోపానాలు అని తెయూ వీసీ టీ యాదగిరిరావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో ఉద్యోగాల కోసం పోటీ తీవ్రమైందని, విద్యార్థులు కేవలం అకడమిక్ పరంగా మాత్రమే కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నప్పుడే విజయం సాధిస్తారని అన్నారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో, ఉద్యోగ అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్‌కు చెందిన రిసోర్స్ పర్సన్స్ పవన్ రెడ్డి, అంజలి మాట్లాడుతూ.. విద్యార్థులకు కెరీర్ ప్రణాళిక, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, సమయపాలన, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ నిచ్చినట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది విద్యార్థులకు వీసీ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంబాబు, ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ పాత నాగరాజు, జీ శ్రీనివాస్, సీహెచ్ శ్రీనివాస్, కిరణ్ రాథోడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


