సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొ రత నేపథ్యంలో జిల్లాలో వంట చెరకుకు డి మాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా భోజన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు సు మారు రెండు వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ఇందులో అత్యధికంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వి నియోగిస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాని కి చాలామంది గ్యాస్‌కు బదులు వంటచెరుకు వాడేవారు ఉన్నారు. కాగా, ప్రస్తుతం కమర్షియల్ గ్యా స్ సిలిండర్ల కొరత నెలకొన్న నేపథ్యంలో ప్రధానంగా హో టల్ వ్యాపారులు వంటచెరుకు (కట్టెలు) ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత వంటచెరకుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రాను రాను పరిస్థితులు ఏవిధంగా ఉంటాయోననే ఆలోచనతో చాలామంది వ్యాపారులు వంటచెరకును కొనిపెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు వంటచెరకుతో హోటల్స్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
నాలుగు రోజుల్లో ఇంటికే సిలిండర్..
గృహ వినియోగానికి సంబంధించి గతంలో గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్ చేస్తే రెండు రోజుల సమయంలో ఇంటికి డెలివరీ ఇచ్చేవారు. ప్రస్తుతం బుక్ చేసిన నాలుగు రోజులకు డెలివరీ చేస్తున్నారు. దీంతో గ్యాస్ కొరత నెలకొంటుందనే ఆలోచనతో గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుండగా, జిల్లా అధికారులు సైతం చెబుతున్నారు. అయినప్పటికీ వ్యాపారులు, డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
రెట్టింపు ధరకు వంటచెరుకు..
వంటచెరుకు ధర గతంలో కిలో రూ.5 వరకు మాత్రమే ఉండగా, ప్రస్తుతం రెట్టింపు అయి కిలో రూ.10 లకు పెరిగింది. కట్టెల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్ ఏర్పడింది. దీంతో ధర అమాంతం పెరిగింది. చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల నుంచి మోస్తరు హోటల్స్ వరకు కట్టెలు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తుండటంతో డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవలి వరకు బంగారం ధరలు భారీగా పెరగగా, ఇప్పుడు కట్టెల ధరలు పెరుగుతుండడంతో కాలమహిమ ఎప్పుడెలా ఉంటుందో తెలియదని పలువురు అంటున్నారు. గ్యాస్ విషయంలో బ్లాక్ దందాకు రంగం సిద్ధమవుతుండగా, కట్టెల విషయంలో నూ ఇదే పరిస్థితి వచ్చే అవకాశాలు నెలకొన్నా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్‌లో
ఓ అంగడిలో కట్టెలు
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలల ప్రభావం స్థానికంగానూ పడుతోంది. వంట గ్యాస్ కొరత ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వాణిజ్య సిలిండర్లు సరిగ్గా దొరక్క పోవడంతో కట్టెలకు డిమాండ్ ఏర్పడింది. హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు సిలిండర్లకు బదులు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిని ఉపయోగిస్తున్నారు.
ప్రత్యామ్నాయం లేదు...
హోటళ్లు, టిఫిన్ సెంటర్‌లకు సిలిండర్‌ల సరఫరా నిలిచిపోతే చాలా ఇబ్బంది. ఇప్పటికే ఉన్న స్టాక్‌తో నెట్టుకొని వస్తున్నాం. సిలిండర్లకు మరో ప్రత్యామ్నాయం లేదు. కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి కమర్షియల్ సిలిండర్లను సరఫరా చేయాలి.
– చిటికేసి రఘు, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, కమ్మర్‌పల్లి
టీస్టాల్ మూసుకుంటే ఇబ్బందే..
సిలిండర్లు లేక టీస్టాల్ మూసుకుంటే ఇల్లు గడవడటం కష్టమైతుంది. ఇంటింటికి గ్యాస్ సరఫరాపై దృష్టి పెట్టినట్లే ప్రభుత్వం మాలాంటి చిన్న వ్యాపారులపై దయ చూపాలి. సిలిండర్లు సరఫరా అయ్యేలా చూసి మా దందా దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి.
– కాలేరు గణేశ్, టీ స్టాల్ నిర్వాహకుడు, కమ్మర్‌పల్లి
కట్టెల పొయ్యిలపై కష్టమైతుంది..
కొన్నేళ్లుగా సిలిండర్లపై వంట చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోతే కట్టెల పొయ్యిలపై వంట చేయడం కష్టమవుతుంది. కట్టెలు కొనాలన్నా మార్కెట్‌లో ధర బాగానే ఉంది. ఎలా ఉంటుందో ఏమో అర్థం కావడం లేదు.
– పర్స నిరంజన, మధ్యాహ్న భోజనం ఏజెన్సీ, మోర్తాడ్
వాణిజ్య సిలిండర్ల కొరతతో ప్రాధాన్యమిస్తున్న హోటల్ వ్యాపారులు
పెరిగిన వంట చెరుకు ధర
గృహ వినియోగంలో కొరత లేకున్నప్పటికీ
వినియోగదారుల్లో గందరగోళం
డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే
ఆరోపణలు


