● జిల్లాకు సరిపడా ఎల్‌పీజీ సిలిండర్లు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి
నిజామాబాద్ అర్బన్: వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో గ్యాస్ కొరత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నులపై శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోంది. శుక్రవారం నాటికి 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయని, వీటికి అదనంగా మరో 5,875 సిలిండర్లు జిల్లాకు రానున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బుక్ చేసిన మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో గృహావసరాల సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలను ముమ్మరం చేయించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథాశ్రమాలకు ఇండెంట్‌లు అందిన వెంటనే సిలిండర్లు సరఫరా చేయాలని ఏజెన్సీల నిర్వాహకులకు సూచించారు. సమావేశంలో అ దనపు డీసీపీ బస్వారెడ్డి, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఏఎస్‌వో అరవింద్ రెడ్డి, డీటీవో ఉమామహేశ్వర్ రావు, డీపీవో శ్రీనివాస్ రావు, డీడబ్ల్యూవో పద్మ, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు, ఎల్‌పీజీ డీలర్లు పాల్గొన్నారు.


