కలెక్టర్ ఇలా త్రిపాఠి
పెర్కిట్(ఆర్మూర్): అధికారులు క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో రోగులకు కల్పిస్తున్న సుదపాయాలు, అందుబాటులో ఉన్న ఔషధాల రికార్డులను పరిశీలించారు. అలాగే సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ముందస్తుగా సమాచారం అందజేస్తూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలన్నారు. దీంతోపాటు కేజీబీవీ, జ్యోతిబా ఫూలే పాఠశాల, సంక్షేమ వసతి గృహాల్లో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో రాజశ్రీ, పీహెచ్‌సీ వైద్యాధికారిణి మానస, వైద్య సిబ్బంది ఉన్నారు.


