● ముందుగా గుర్తిస్తే అంధత్వ నివారణ
● చూపు తగ్గితే.. తిరిగి రాదు!
● డాక్టర్ టి.శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వైద్యులు
నిజామాబాద్ అర్బన్: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని పెద్దలు చెబుతుంటారు. కానీ, కంటికి గ్లకోమా నుంచి అనేక విధాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ (ఐవోపీ) ఎక్కువ కావడం, కంటి నరాలు దెబ్బతినడంతో ఏర్పడే రుగ్మతే గ్లకోమా అని డాక్టర్ టి.శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వైద్యులు టి.శ్రీనివాస్ చెప్తున్నారు. కంటి నుంచి మెదడుకు దృష్టి సంకేతాలను తీసుకెళ్లే బాధ్యత కంటి నరాలదే. గ్లకోమాను తొలిదశలోనే గుర్తించకపోతే చూపు కోల్పేయే ప్రమాదం ఉందని, తొలిదశలో గుర్తిస్తే దీనికి మంచి మందులు, శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీంతో శాశ్వత అంధత్వం బారిన పడకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ టి.శ్రీనివాస్ పేర్కొంటున్నారు. గ్లకోమా వారోత్సవాల సందర్భంగా గ్లకోమా అంశంపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు.
గ్లకోమా ఎందుకొస్తుంది..?
గ్లకోమాకు మూలం కంట్లో ఒత్తిడి పెరగటం. మనం కంటితో చూసేవన్నీ దృశ్యనాడి ద్వారా మెదడుకు చేరతాయి. అప్పుడే ఆయా దశ్యాలు మనకు కనిపిస్తాయి. అయితే కంట్లో ఒత్తిడి పెరిగితే ఈ దృశ్యనాడి దెబ్బతినడం ప్రారంభమవుతుంది. దీంతో చూపు పరిధి తగ్గటం మొదలవుతుంది. నెమ్మదిగా.. చివరికి పూర్తి అంధత్వానికి దారితీస్తుంది.
నిర్ధారించడం ఎలా?
బోనోమెట్రీ పరీక్ష ద్వారా కంట్లో ఒత్తిడిని గుర్తిస్తారు. అలాగే కంట్లో చుక్కల మందు వేసి కనుపాప పెద్దగా ఆయ్యాక లోపల దృశ్యనాడి ఎలా ఉందో చూస్తారు. దృశ్యనాడిలో ఏదైనా తేడా ఉంటే చూపు పరిధిని తెలిపే పెరిమెట్రీ పరీక్ష చేస్తారు. గ్లకోమా నిర్ధారణకు ఇది ముఖ్యమైన పరీక్ష. నీటికాసుల్లో చుట్టుపక్కల నుంచి చూపు పరిధి తగ్గుతూ వస్తుంది. అందుకే తల తిప్పకుండా చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నవి కనిపించే పరిధి తగ్గుతోందా? అనేది ఇందులో బయటపడుతుంది. జబ్బు నిర్ధారణకే కాదు. తీవ్రత తెలుసుకోవటానికి, మందుల పనితీరును గుర్తించటానికీ ఇది ఉపయోగపడుతుంది.
చికిత్స ఇలా..
కంట్లో ఒత్తిడిని తగ్గిస్తే దృశ్యనాడి దెబ్బతినకుండా చూసుకోవచ్చు. గ్లకోమాలో ఉన్న చూపును కాపాడుకోవటం తప్పించి చేయగలిగిందేమీ లేదు. అందుకే ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత మంచిది. కంట్లో ఒత్తిడి తగ్గటానికి చుక్కల మందులు ఉపయోగపడతాయి.


