భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో చోరీకి యత్నం, రామేశ్వర్‌పల్లి గ్రామంలో చోరీ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆమె వివరాలను వెల్లడించారు. ఈనెల 6న రామేశ్వర్‌పల్లికి చెందిన రాజు ఇంటి తాళం పగులగొట్టి, రెండు జతల పట్టల గొలుసులు, రూ. పదివేల నగదును దుండగులు చోరీ అయ్యాయి. ఈనెల 8న భిక్కనూరులోని వేంకటేశ్వరాలయం తాళంను దుండగులు పగులగొట్టి హూండీలో చోరీకి యత్నించగా స్థానికులు గుర్తించడంతో పారిపోయారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బుధవారం బీటీఎస్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామానికి చెందిన లంబాడి శ్రావణి, నర్సపూర్‌కు చెందిన స్క్రాపు వ్యాపారి పర్థం ఏలియా అలియాస్ ప్రవీణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి, ఆమె భర్త మోచి శ్రీనివాస్ కలిసి పాత సామానులు, ప్లాస్టిక్ కాగితాలను ఏరుకుంటూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. తర్వాత రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతారు. చోరీ సొత్తును ప్రవీణ్‌కు విక్రయిస్తారు. నిందితులు ఫిబ్రవరిలో సంగారెడ్డి జిల్లా పుల్కల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముదిమానిక్ గ్రామంలో ఒక ఇంటి తాళం పగులగొట్టి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, వెండి పట్టగొలుసులు నగదును చోరీ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని, శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ సంపత్‌కుమార్, ఎస్సై అంజనేయులు సమావేశంలో పాల్గొన్నారు.


