నిజామాబాద్ అర్బన్: ఆశా వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జాగృతి నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం ఆశా వర్కర్లతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జాగృతి జిల్లా నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. పెండింగ్ వేతనాలను విడుదల చేయాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు సహారా భాను, జిల్లా ప్రధాన కార్యదర్శి అనూష, మంజుల, శిరీష, శ్రీదేవి, లత తదితరులు పాల్గొన్నారు.
ఇందల్వాయి: మండలంలోని గౌరారం గ్రామ పరిధి లోని లింగాపూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా, ప్రజా ప్రయోజనాలకు ఆటంకం కలిగించేవిధంగా వేసిన బోరుబావిని అధికారులు బుధవారం సీజ్ చేసినట్లు సర్పంచ్ హేమలత తెలిపారు. గ్రామానికి చెందిన ఓ రైతు గ్రామ పంచాయతీ బోరు బావికి దగ్గరగా వాల్టా చట్టానికి విరుద్ధంగా బోరు వేయడంతో పంచాయతీ బోరు నుంచి నీరు రావడం తగ్గంది. ఈ విషయంపై రెవెన్యు అధికారులకు ఫిర్యాదు చేయగా జీపీవో, పంచాయతి కార్యదర్శి విచారణ చేపట్టి సదరు బోరు బావిని సీజ్ చేసినట్లు తెలిపారు.
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పా ల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌హెచ్‌వో తుల శ్రీధర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మన్నె గంగాధర్(33) అనే యువకుడు వృత్తిరీత్య ఫో టోగ్రాఫర్‌గా జీవనం సాగించేవాడు. కొంతకాలంగా పని లేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. దీంతో అప్పులు పెరిగిపోవడం, గొడవలు తదితర కారణాలతో జీవితంపై విరక్తిచెందాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం తన ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


