బోధన్: ఎడపల్లి మండలంలోని మంగల్‌పహాడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో హనుమాన్ దీక్షాస్వాములు భజనలు చేస్తూ నిరసన చేపట్టారు. వివరాలు ఇలా.. పాఠశాలలోని పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల హనుమాన్ దీక్షా ధరించి బడికి వచ్చాడు. దీంతో ఓ మహిళా ఉపాధ్యాయురాలు రెండు రోజుల నుంచి సదరు విద్యార్థిని కించపర్చేలా ప్రవర్తించారు. ఈ విషయాన్ని విద్యార్థి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. స్థానిక హనుమాన్ దీక్షాస్వాములకు విషయం తెలియడంతో బుధవారం వారు పాఠశాలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి భజనలు చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న ఎంఈవో శివలింగ్ గాలప్ప పాఠశాలకు వచ్చి విచారణ చేశారు. ఆందోళన చేపట్టిన హనుమాన్ దీక్షా స్వాముల వద్దకు వచ్చి చర్చించారు. టీచర్ నుంచి వివరణ తీసుకుని పూర్తిస్థాయి విచారణ చేపడుతామని ఎంఈవో వెల్లడించారు. స్వాములను సముదాయించి ఆందోళన విరమింప చేశారు.


