నిజామాబాద్ – జగిత్యాల – సిరిసిల్ల అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న పులి
● ఈసారి సిరికొండ రేంజ్ ద్వారా వచ్చి మళ్లీ కమ్మర్‌పల్లి రేంజ్‌లోకి
● మూడు చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీ అధికారులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహారాష్ట్ర నుంచి కొ న్ని నెలల క్రితం వచ్చిన పెద్ద పులి తెలంగాణలోని వివిధ జిల్లాల అటవీ ప్రాంతాల్లో ఆడ పులి కోసం తిరుగుతూ వచ్చి చివరకు నిజామాబాద్ – జగిత్యా ల – సిరిసిల్ల జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతోంది. తోడు కోసం వెతుకుతున్న పెద్ద పులికి ట్రయాంగిల్‌లో ఉన్న ఈ మూడు జిల్లాల పరిధి లోని అటవీ ప్రాంతాల్లో ఆహారం సమృద్ధిగా లభించే విధంగా పులి ఎక్కువగా ఇష్టపడే సాంబార్, దు ప్పులు, నీల్గాయి, కొండగొర్రె, జింకలు, కుందేళ్లు, అడవి పందులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలోని ఇందల్వాయి, సిరికొండ, కమ్మర్‌పల్లి రేంజ్‌లలో వ న్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన సాసర్‌పిట్లలో నీ టిని నింపేందుకు సోలార్ మోటార్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పలుచోట్ల అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు పలుచోట్ల చెక్‌డ్యాములు సైతం ఏర్పాటు చేశారు. తోడు కోసం వచ్చిన పులి నిజామాబాద్, జగిత్యా ల, సిరిసిల్ల జిల్లాల అటవీ ప్రాంతాల మధ్య తిరుగుతున్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు చోట్ల పాదముద్రలు..
ఈ నెల 3వ తేదీన జగిత్యాల జిల్లా అటవీ ప్రాంతం నుంచి జిల్లాలోని కమ్మర్‌పల్లి రేంజ్ అడవిలోకి వచ్చిన పులి గట్టుపొడిచినవాగు డ్యాం బ్యాక్‌వాటర్ సమీపంలో రెండు రోజుల పాటు తిష్ట వేసింది. 6వ తేదీన తిరిగి సిరిసిల్ల జిల్లా చందుర్తి అడవిలోకి వెళ్లిపోయింది. తిరిగి ఈ నెల 9వ తేదీన జిల్లాలోని సిరిసిల్ల రేంజ్ అటవీ ప్రాంతంలోకి వచ్చింది. సిరికొండ రేంజ్‌లోని జంగ్యాల అటవీ ప్రాంతంలో సోమవారం పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. మంగళవారం కమ్మర్‌పల్లి రేంజ్‌లోని తాటిపల్లి భీంగనర్ అడవిలో పులి పాదముద్రలను కనుగొన్నారు. దీంతో సిరికొండ, కమ్మర్‌పల్లి రేంజ్‌లలో అటవీ అధికారులు మూడు చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. తోడు దొరికే వరకు మగపులి తిరుగుతూనే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు, పొలాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి. పొలాల్లో, గ్రామాల సమీపంలో పులి పాదముద్రలు కనిపిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలి. అటవీ అధికారులు, సిబ్బందితో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేశాం. ట్రాప్ కెమెరాలతో వివరాలు సేకరించే ఏర్పాట్లు చేశాం. చుట్టుపక్కల జిల్లాల అటవీ అధికారులు, సిబ్బందితో పూర్తి సమన్వయం చేసుకుని, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం.
– వికాస్ మీనా, జిల్లా అటవీ అధికారి


