క్వింటాల్ ధర రూ.3,950 నుంచి రూ.3,400కు తగ్గించిన సిండికేట్
● ఒకేసారి ధర రూ.550
తగ్గడంతో రైతుల్లో ఆందోళన
మోర్తాడ్(బాల్కొండ): ఎర్రజొన్న ధర విషయంలో వ్యాపారులు తమ పంతం నెగ్గించుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ధర రూ.3,800 నుంచి రూ.3,950 ఉండగా, ఒకేసారి రూ.550 వరకు తగ్గించారు. క్వింటాల్‌కు రూ.3,400 చెల్లిస్తామని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో డిమాండ్ పెరుగుతుందని రైతులు ఆశించినప్పటికీ.. అందుకు భిన్నంగా వ్యాపారులు ధర తగ్గించి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. పంట సాగుకు ముందు బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం సూచించింది. బైబ్యాక్ ఒప్పందానికి వ్యాపారులు వెనుకంజ వేయగా రైతులు కూడా ఎలాంటి ఒత్తిడి చేయలేదు. అయితే ఉత్తరాది రాష్ట్రాలతోపాటు పొరుగు దేశాల్లో ఎర్రజొన్నకు మంచి మార్కెట్ ఉన్నా కావాలని వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
మన జిల్లాలోనే అత్యధికంగా..
వాణిజ్య పంటల సాగు మన జిల్లాలోనే ఎక్కువగా ఉంది. ఎర్రజొన్నలు ఎక్కువగా జిల్లాలోనే సాగవుతుండగా, నిర్మల్, జగిత్యాల్ జిల్లాల్లో కొంత మేర సాగవుతోంది. జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 34,086 ఎకరాల విస్తీర్ణంలో, 2024–25 సంవత్సరంలో 25,445 ఎకరాల్లో, 2025–26లో 22,378 ఎకరాల్లో రైతులు ఎర్రజొన్న సాగు చేశారు. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో ధర పెరుగుతుందని భావించిన రైతుల ఆశలపై వ్యాపారులు నీళ్లు చల్లారు.


