చింతకాయల కోసం వెళ్లి..
● చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి
డిచ్‌పల్లి: చింతకాయల కోసం చెట్టుపైకెక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటన డిచ్‌పల్లి మండలం మిట్టాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గ్రామానికి చెందిన మైలారం చిన్న పోశన్న (55) చింతకాయలు తెంపడానికి చెట్టుపైకి ఎక్కాడు. కాలుజారి చెట్టుపై నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోశన్న మృతి చెందాడు. భార్య చిన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రుద్రూర్ : మండలంలోని అక్బర్‌నగర్ గ్రామానికి చెందిన కల్దుర్కి పోశెట్టి (57) మృతదేహం లభ్యమైంది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్లిన పోశెట్టి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు పొలం పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే, సోమవారం ఉదయం పొలం సమీపంలో ఉన్న చెరువులో మృతదేహం కనిపించింది. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. కాలకృత్యాలకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడటంతో మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో 86 మందికి శిక్ష
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు సోమవారం ఒకే రోజు 86 మందికి శిక్ష విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా 8 మందికి ఒక రోజు, ఒకరికి 2 రోజుల జైలు శిక్షతో పాటు మొత్తం 86 మందికి రూ.1,22,500 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్‌ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.


