ప్రభుత్వం ఆలోచన చేయాలి
● ప్రభుత్వానికి మాజీ సర్పంచుల వినతి
● పేరుకుపోయిన బకాయిలు
రూ.15 కోట్ల పైమాటే
మోర్తాడ్: జీపీల ద్వారా రావాల్సిన పెండింగ్ బిల్లులను ఇప్పించాలని మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాము పదవీలో ఉన్న సమయంలో చేసిన పనులకు బకాయిలు అలాగే ఉన్నాయని ఎంబీ రికార్డులు చేసినా బిల్లులు చెల్లించకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు రూ.27.23 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.15 కోట్ల వరకూ ఉన్నాయి. నిధులు తక్కువ మొత్తంలో విడుదల కాగా దశల వారిగానైనా బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు కోరుతున్నారు. బిల్లు బకాయిలు చెల్లించాలని గతంలో మాజీలు అనేక మార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినా బిల్లులు చెల్లించే విషయంలో నాన్చివేత ధోరణి అవలంభించిందనే ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్యం, చిన్న చిన్న మరమ్మతులు, స్టేషనరీ కొనుగోలు, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం ఇలా ఎన్నో రకాల పనులు చేయగా ఎంబీ రికార్డులు చేయించి ఉంచారు. నిబంధనల ప్రకారం ఎంబీ రికార్డులు చేసి ఉంటే బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు వస్తేనే పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు మోక్షం లభిస్తుందని మాజీ సర్పంచులు వెల్లడిస్తున్నారు.
గతంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేశాం.గ్రామాల అ భివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశాం. ప్రభుత్వం ఆలోచన చేసి మా బిల్లు బకాయిలు ఇప్పించాలి. గతంలో మంత్రి సీతక్క బిల్లు బకాయిలు చెల్లించేలా చూస్తామని హమీ ఇచ్చారు. తొందరగా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. – కడారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, సుంకెట్


