ఇజ్రాయిల్‌లో గాయాలపాలైన కోయల్కర్ తిరుపతి
ఇజ్రాయిల్–ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ రెండు దేశాలతో పాటు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన వలసకార్మికుల కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
గల్ఫ్ యుద్ధం రోజురోజుకూ ఉధృతం అవుతుండడంతో ఎప్పుడు ఏంజరుగుతుందోననే టెన్షన్‌లో కా ర్మికుల కుటుంబాల వారు ఉన్నారు. ఆయా దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సన్నిహితులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేమసమాచారాలు, అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు.
● కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన కోయ ల్కర్ తిరుపతి ఇజ్రాయిల్‌లోని టెల్‌అవీవ్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నాడు. తిరుపతి ఎప్పటికప్పుడు తన క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెబుతూ వస్తున్నాడు. అయితే సోమవారం కమ్మర్‌పల్లిలోని స్నేహితులతో మాట్లాడిన అరగంట తరువాత తాను పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలో బాంబు పడింది. దీంతో ఆ ధాటికి కారు అద్దాలు పగిలి తిరుపతి దవడ, గొంతు భాగంలో గుచ్చుకున్నాయి. ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడకు తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
● ఆలూరు మండల కేంద్రానికి చెందిన మల్లయ్య మస్కట్‌లో రోడ్డు ప్రమాదంలో ఈ నెల 6న మరణించాడు. అయితే సాధారణ సమయాల్లో అక్కడ ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాలంటే రెండువారాల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నందున విమానాలు నడవడం లేదు. దీంతో మల్లయ్య మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఎంతకాలం ఎదురుచూడాలోనని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.
● మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన లక్ష్మినర్సు రెండ్రోజుల క్రితం మృతి చెందింది. దుబాయ్‌లో ఉంటున్న ఈమె భర్త లింబాద్రికి సమాచారం ఇచ్చారు. అయితే తాజా యుద్ధం నేపథ్యంలో లింబాద్రి ఇక్కడకు రాలేని పరిస్థితి నెలకొంది. యుద్ధం ఇంకా ఎంతకాలం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. దీంతో భార్య అంత్యక్రియలకు దూరం కావాల్సి వచ్చింది.
● గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్ చుట్టుపక్కల దేశాలకు వాయురవాణా నిలిచిపోవడంతో రాకపోకలు నడవడం లేదు. దీంతో అక్కడ పనిచేస్తున్నవారు మరణించినా, ఇక్కడ కుటుంబాల్లో ఎవరైనా మరణించినా, ఇతర అత్యవసర పరిస్థితులు నెలకొంటే రాకపోకలకు అవకాశాలు లేకపోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర మనోవేదన నెలకొంది.
ఇజ్రాయిల్‌లో బాంబు దాడిలో
గాయపడ్డ కమ్మర్‌పల్లి వాసి
సావెల్‌లో భార్య మరణించగా
అంత్యక్రియలకు ఇక్కడకు రాలేని భర్త
దుబాయ్‌లో రోడ్డు ప్రమాదంలో
వలసకార్మికుని మృతి..
మృతదేహాన్ని తీసుకురాలేని పరిస్థితి


