● విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
● వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో ఈ నెల 17న వర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు తెలిపారు. సోమవారం తన చాంబర్‌లో మెగా జాబ్ ఫెయిర్‌కు సంబంధించిన బ్రోచర్స్‌ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధులతో కలిసి వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమని అన్నారు. మెగా జాబ్ ఫెయిర్ ద్వారా వర్సిటీ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను ప్రదర్శించి మంచి సంస్థల్లో ఉద్యోగాలను పొందాలని సూచించారు. జాబ్ ఫెయిర్‌లో సుమారు 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను అందించే అవకాశం ఉందన్నారు. ఐటీ, ఐటీఈఎస్, కోర్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్‌ఎంసీజీతోపాటు మేనేజ్‌మెంట్ వంటి వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొంటాయని వీసీ తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ.. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొనే అవకాశముందని తెలిపారు. 2016 నుంచి 2026 వరకు చదువు పూర్తిచేసిన అభ్యర్థులు జాబ్ ఫెయిర్‌లో పాల్గొనవచ్చని చెప్పారు. బ్రోచర్ ఆవిష్కరణలో తెయూ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ పాత నాగరాజు, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధులు హర్ష, అనూషా రెడ్డి, వర్సిటీ పీఆర్‌వో రమణాచారి, ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, నాగరాజు, వాసం చంద్రశేఖర్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.


