బీరులో మత్తు కలిపి..మాయం చేశారు
● బంగారం, నగదు చోరీ
● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ అర్బన్: మత్తు పదార్థాలు ఇచ్చి చోరీకి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీశ్ తెలిపారు. గత డిసెంబర్ 17న వంశీ ఇంటర్నేషనల్ హోటల్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి తాగుతున్న బీరులో మత్తు గో లీలు కలిపి అతని వద్ద నుంచి రెండు బంగారు ఉంగరాలు, గోల్డ్ చైన్, కొంత నగదు దొంగిలించుకుపోయారు. ఈ మేరకు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా నిందితులైన భారత ప్రసాదం, నర్సింగ్‌రావు, రుద్ర యాదవ్‌లను పోలీసులు పట్టుకొని విచారించారు. వీరు దొంగిలించిన సొమ్మును హైదరాబాద్‌లో శ్రీనివాస్‌గుప్త అనే వ్యాపారి వద్ద తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. బియ్యం వ్యాపారం గురించి మాయమాటలు చెప్పి మాట్లాడదామని బీర్లలో మత్తు పదార్థాలు కలిపి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. సమావేశంలో ఎస్సై సందీప్, ఉదయ్ కుమార్, ఏఎస్‌ఐ రవీందర్, కానిస్టేబుల్ శేఖర్, రమేశ్, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.


