ఓటరు జాబితాలో అన్నీ తప్పులే..
నిజామాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కై వసం చేసుకుంటుందనే భయంతోనే పాలకపక్షం ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితాపై కమిషనర్ దిలీప్ కుమార్‌తో భేటీ అయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, పొరపాట్లపై చర్చించి, అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక వార్డులోని ఓటర్లను కావాలనే మరో వార్డులోకి మార్చారని, అర్హులైన వేలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. స్థానిక అధికార ప్రతినిధి కనుసైగల్లోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ ముసాయిదాను తప్పుల తడకగా తయారు చేయించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుండటంతో, ఓటమి భయంతోనే అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా అధికారులు వారికి తొత్తులుగా మారడం సరికాదని అన్నారు. క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ చేపట్టి తప్పులను సరిదిద్దాలని, వార్డుల వారీగా ఓటర్ల విభజన శాసీ్త్రయంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాను సరిదిద్దకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
పాలకపక్షం ఒత్తిళ్లకు
అధికారులు తలొగ్గారు
మేయర్ పీఠం కోసమే
ఓట్ల గందరగోళం
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ


