అదను దాటుతోంది..
మోర్తాడ్(బాల్కొండ): యాసంగి సీజన్ ఆరంభమైనా పెట్టుబడి సాయం(రైతు భరోసా) పథకం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైంది. పంటల సాగు ప్రారంభానికి ముందుగానే అందించాల్సిన పెట్టుబడి సాయం ప్రతి సీజన్‌లో ఆలస్యమవుతుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పథకం ప్రారంభంలో ఒక్కో ఎకరానికి రూ.5 వేల చొప్పున సాయం అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం సాయం సొమ్మును ఒక్కో ఎకరానికి రూ.వెయ్యి పెంచింది. గత వర్షాకాలం సీజన్‌లో జిల్లాలో 2,98,472 మంది రైతులకు రూ.326.03 కోట్ల సాయం సొమ్మును జమ చేశారు. అయితే, జూన్ 20వ తేదీలోగా చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో భరోసా సొమ్మును జమ చేశారు. చాలా రోజుల తర్వాత పెద్ద రైతులకు కూడా భరోసా సొమ్మును అందించారు. అయితే, జిల్లాలో ఇప్పటికే పెద్ద మొత్తంలో వరి నాట్లు పూర్తయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో మరో వారం, పది రోజుల్లో నాట్లు పూర్తికానున్నాయి. రైతు భరోసా డబ్బులు రాకపోవడంతో పంట పెట్టుబడుల కోసం రైతులు యథావిధిగా బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. పెట్టుబడి సాయం సకాలంలో అందిస్తే అప్పులు చేయాల్సిన అవసరం ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని కోరుతున్నారు.
పాత పద్ధతిలోనే సాయం అందించాలి..
సాగుకు యోగ్యంగా లేని భూములను గతంలోనే గుర్తించారు. పాత పద్ధతిలోనే సాయం అందిస్తే బాగుంటుంది. చిన్న, సన్నకారు రైతులకు ‘రైతు భరోసా’ ఎంతో అండగా ఉంటుంది. ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొమ్మును విడుదల చేయాలి.
– తక్కూరి సాగర్, రైతు, మోర్తాడ్
ఆలస్యం చేయవద్దు..
చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. షెడ్యూల్ ప్రకారం పెట్టుబడి సాయాన్ని అందిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.
– దేగాం రాములు, రైతు, అంక్సాపూర్
పంట పెట్టుబడి సాయం కోసం
రైతుల నిరీక్షణ
యాసంగి సీజన్ పనులు ఊపందుకున్నా రైతు భరోసాపై స్పష్టత కరువు
ప్రతిసారి ఆలస్యంగానే పెట్టుబడి సాయం
అదను దాటుతోంది..
అదను దాటుతోంది..


