ప్రజాక్షేత్రంలో ఉన్న వారికే బీఫామ్
నిజామాబాద్ రూరల్: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజల మధ్య ఉన్న వారికే మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో బల్దియా ఎన్నికలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్ కారణంగా కొంత నష్టం జరిగిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో మున్సిపాలిటీలను కై వసం చేసుకుంటామన్నారు. రెండేళ్లలో 80వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. జిల్లా వాసుల 30 ఏళ్ల కల అయిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలలను తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేశామని, జిల్లాలో దాదాపు రూ.600 కోట్ల విలువైన రోడ్ల పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాలు వివక్షకు గురయ్యాయని, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్‌హౌస్‌కి పలాయనం చిత్తగించారని విమర్శించారు. నిజామాబాద్ కేంద్రంగా బియ్యం స్మగ్లింగ్ చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ కథ ముగిసిపోయిందని, కవిత విమర్శలకు హరీశ్‌రావు, కేటీఆర్ వద్ద జవాబు లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల సహకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు పయనింపజేస్తున్నారన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ అంశం తేలాకే జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో సీఎం ఉన్నారన్నారు. దేవుడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే వారికి గుణపాఠం చెప్పాలని అన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌రావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్త చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు, మహిళ నాయకురాలు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండే అవకాశం
రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారు
దేవుడి పేరుతో ఓట్లడిగే వారికి గుణపాఠం చెప్పాలి
మీడియాతో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్


