డాక్టర్ అవతారమెత్తిన కాంపౌండర్లు
నిజామాబాద్ నాగారం: పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు. జిల్లా కేంద్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నగరంలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల న్యూరో వైద్యుడు లేకపోవడంతో కాంపౌండరే వైద్యుడిగా అవతారమెత్తి సేవలందించడంపై అధికారులకు ఫిర్యాదు వెళ్లిన విషయం తెలిసిందే. అది మరువకముందే తాజాగా మరో రెండు ఆస్పత్రుల్లో కాంపౌండర్లు వైద్య నిపుణుల అవతారమెత్తారు. నగరంలోని శ్రీరామ నేత్ర వైద్యశాల, గిరిజా కంటి ఆస్పత్రులకు చెందిన వైద్యుడు కృష్ణమూర్తి గత మూడు రోజులుగా అందుబాటులో లేరు. దీంతో కంటి సమస్యలతో ఈ ఆస్పత్రులకు వచ్చే రోగులకు కాంపౌండర్లు పరీక్షలు నిర్వహిస్తూ మందులు సైతం రాస్తున్నారు. ఈ విషయమై శనివారం రోగులు ఫిర్యాదు చేయడంతో డీఎంహెచ్‌వో రాజశ్రీ స్పందించారు. డాక్టర్ సుప్రియ, అధికారులు వేణు తదితరులు కలిసి రాత్రి 7 గంటల నుంచి 9.30 గంటల వరకు రెండు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఎంత మంది రోగులకు పరీక్షలు నిర్వహించి, మందులు రాశారో పరిశీలించారు. తనిఖీల విషయం తెలుసుకున్న డాక్టర్ కృష్ణమూర్తి ఆస్పత్రులకు చేరుకున్నారు. కాగా, పూర్తి నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో రాజశ్రీ ‘సాక్షి’తో తెలిపారు.
ప్రముఖ కంటి వైద్యుడు కృష్ణమూర్తి
ఆస్పత్రుల్లో ఘటన
ఫిర్యాదు రావడంతో
వైద్యాధికారుల తనిఖీలు


