
నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం జోరందుకున్న వేళ కొత్త హామీలు తెరపైకి వస్తుండటంతో గల్ఫ్ వలస కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మేనిఫెస్టోను విడుదల చేయగా అందులో గల్ఫ్ ప్రవాసుల కోసం బోర్డు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇతర అంశాలపై హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ డిచ్‌పల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ గల్ఫ్ వలస కార్మికులకు రూ. 5 లక్షల బీమా వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు.
వలస కార్మికుల అంశంపై బీజేపీ తన వైఖరిని వెల్లడించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో కొనసాగినా గల్ఫ్ వలస కార్మికుల విషయంలో ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. ఎన్నికలకు ముందు నుంచి గల్ఫ్ వలస కార్మికుల సంఘాలు కార్మికులు, వారి కుటుంబాల కోసం ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
మొదట్లో పార్టీ మెతక వైఖరి..
గల్ఫ్ అంశంపై మొదట్లో అన్ని పార్టీలు మెతక వైఖరిని అవలంభించాయనే విమర్శలు ఉన్నాయి. కేవలం దివంగత సీఎం వైఎస్సార్ తన హయాంలో గల్ఫ్ మృతులకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేశారు. అలాగే వాపస్ వచ్చిన వలస కార్మికులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా రాయితీ రుణాలను ఇప్పించారు. వైఎస్ మరణానంతరం వలస కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకున్నవారు ఎవరూ లేరు.
ఇప్పుడు గల్ఫ్ బోర్డును కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకురాగా, బీఆర్‌ఎస్ కార్మికులకు బీమా వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా రేషన్ కార్డుల నుంచి వలస కార్మికుల పేర్లు తొలగిస్తే బీమా ఎలా వర్తింప చేస్తారనేది సంశయంగా మారింది. ఏపీలోని వైఎస్ జగన్ ప్రభు త్వం వలస కార్మికులకు కేంద్రం అందిస్తున్న రూ. 10 లక్షల బీమాను వర్తింపజేస్తూ చర్యలు తీసుకుంది. ఏపీ నుంచి విదేశాలకు వలస వెళ్లిన కార్మికులకు బీమా వర్తింపచేయడానికి జగన్ ప్రభుత్వం నిబంధనలను సడలించి కార్మికులకు మేలు చేసింది.
తెలంగాణలో గల్ఫ్ బీమా లేదు..
ఇప్పటి వరకు తెలంగాణలో ఎలాంటి బీమా వర్తింప చేయకపోవడం గమనార్హం. గల్ఫ్ గళం వినిపించడానికి ఈ సాధారణ ఎన్నికల్లో ఆరుగురు జేఏసీ నాయకులు పోటీ చేస్తున్నారు. రెండు మూడు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చే సే విధంగా వలస కార్మికుల నాయకులు ప్రచా రం నిర్వహిస్తుండటం విశేషం. ఏదేమైనా ఎన్నికల తరుణంలో వలస కార్మికుల సంక్షేమం అంశం మరోసారి చర్చకు రావడం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.