మారుతున్న సమీకరణలు

తరుణ్‌ఛుగ్‌, ఎంపీ అర్వింద్‌లతో రాకేష్‌రెడ్డి - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లాలో కీలకమైన ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సమీకరణలు మారుతున్నాయి. అంకాపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త, నైన్‌ స్టార్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ పైడి రాకేష్‌రెడ్డి గురువారం ఢిల్లీలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆధ్వర్యంలో పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాకేష్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి రేవతిరెడ్డి, కుమార్తె సుచరితరెడ్డి, నియోజకవర్గ నాయకురాలు విజయభారతి ఉన్నారు. పార్టీ కండువా కప్పుకున్న వెంటనే రాకేష్‌రెడ్డి తన ఉద్దేశాన్ని చాటిన తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆర్మూర్‌ నియోజకవర్గంలో సామాన్యులను బెదిరింపులకు గురిచేస్తూ, బ్లాక్‌మెయిల్‌ చేసే తరహా రాజకీయాలకు చరమగీతం పాడే ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరినట్లు చెప్పడం విశేషం. టిప్పర్లతో గుద్ది చంపే తరహా హత్యారాజకీయాలకు తెరదించేందుకే వస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి కానీ బ్లాక్‌మెయిల్‌కు గురిచేసే వ్యవహారాలు కాదన్నారు. అన్ని వర్గాల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధిస్తే ఒక్క కుటుంబమే లాభం పొందిందన్నారు. పేదలకు మేలు చేసేందుకే బీజేపీలో చేరానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళతానన్నారు. ఇప్పటికే పేదలకు ఒక్క రూపాయికే కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నానన్నారు.

ఆపదలో ఉన్నవారికి పైడి రాకేశ్‌రెడ్డి ఫౌండేషన్‌ ద్వారా ఆర్థికంగా, ఇతర అన్ని రకాలుగా సహాయం చేస్తున్నామన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో తన ముద్ర వేసుకుంటానన్నారు. ఇప్పటికే ఆర్మూర్‌ నియోజకవర్గ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారన్నారు. రాకేశ్‌రెడ్డి రూ పంలో ఓ కరుడుగట్టిన, కమిట్‌మెంట్‌తో కూడిన కార్యకర్తలాగా తనను బీజేపీ పంపుతోందన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఆర్మూర్‌లో ఫ్యా క్షన్‌ రాజకీయాలను కూకటి వేళ్లతో పెకిలిస్తానన్నా రు. గత కొన్నేళ్లుగా పుట్టిన ఊరికి, చుట్టుపక్కల గ్రా మాలకు నిరంతరం సేవ చేస్తున్నానన్నారు. ప్రస్తు తం ఆర్మూర్‌ నియోజకవర్గంలో హత్యలు, అక్ర మాలు, కబ్జాలు నడుస్తున్నాయన్నారు.

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి లక్ష్యంగా..
రాకేష్‌రెడ్డి ప్రకటనలు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని లక్ష్యంగా చేస్తుండగా, ఇప్పటికే అందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అర్వింద్‌ ఆధ్వర్యంలో అందుకు తగినవిధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. కల్లెడ సర్పంచ్‌ దంపతులు లావణ్య, ప్రసాద్‌గౌడ్‌లను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కుట్ర చేసి కేసుల్లో ఇరికించినట్లు ఆరోపణలు, అదేవిధంగా నందిపేట సర్పంచ్‌ దంపతులు కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన విషయమై ఇప్పటికే నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో చాలామంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలను రాకేష్‌రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. లక్కంపల్లి మాజీ సర్పంచ్‌, ప్రస్తుత ఉపసర్పంచ్‌లను హతమార్చేందుకు ఆ గ్రామ సర్పంచ్‌ భర్త మహేందర్‌ సుపారీ ఇచ్చిన విషయమై జిల్లాలో సంచలనమైంది. ఎమ్మెల్యే ఇలాంటి వాళ్లను వెనకేసుకురావడం పట్ల రాకేష్‌రెడ్డి ప్రస్తావించారు.రాకేష్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరితో కలిసేలా ప్లాన్‌ చేసుకోగా, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుండడంతో సమీకరణలు మారనున్నట్లు వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పకడ్బందీగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది.

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top