నిర్మల్‌ఖిల్లా: జిల్లాకు చెందిన ప్రముఖ కవి, చారిత్రక పరిశోధకుడు తుమ్మల దేవరావు ప్రతిష్టాత్మక తెలంగాణ సారస్వత పరిషత్ ధర్మనిధి పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో బుధవారం బీఎన్ శాస్త్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావు చేతుల మీదుగా పురస్కారంతో పాటు రూ.5వేల నగదు, ప్రశంసపత్రం, మెమొంటో అందించి శాలువాతో సత్కరించారు.
జిల్లా చరిత్రపై మక్కువతో...
జిల్లాకు చెందిన 17 శాసనాలు, వందలాది వినూత్నమైన విగ్రహాలు, బౌద్ధ జైన ప్రతిమలు, బౌద్ధ స్తూపాలు, కోట్ల సంవత్సరాలకు చెందిన జంతు, వృక్ష శిలాజాలను తన పరిశోధనలో వెలుగులోకి తెచ్చారు. సాహితీరంగంతోపాటు చారిత్రక పరిశోధనలోనూ అనేక అవార్డులు అందుకున్నారు. నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథరచనలో కన్వీనర్‌గా వ్యవహరించి అనేక చారిత్రక వ్యాసాలను పొందుపరిచారు. కచ్చురం, గడ్డిపూలు, మట్టి పాదాలు, జంగిలి, నిర్మల్ జిల్లా కథలు, నిర్మల్ జిల్లా చరిత్ర రచనలు గుర్తింపు పొందాయి. మట్టి పాదాలు సంకలానికి సినారె పురస్కారం, పలుమార్లు ఎక్స్‌రే, రంజని కుందుర్తి అవార్డు అందుకున్నారు. దేవరావును డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ దామెర రాములు, నేరెళ్ల హనుమంతు, కామరపు జగదీశ్వర్, పత్తి శివప్రసాద్, అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, పోలీస్ భీమేష్, తదితరులు అభినందించారు..


