నిర్మల్‌చైన్‌గేట్: చిత్తడి నేలలతో(వెట్ ల్యాండ్స్) పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చిత్తడి నేలలను శాసీ్త్రయంగా గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. చిత్తడి నేలలతో భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందన్నారు. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, అటవీ శాఖాధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


