భైంసారూరల్: మండల పరిధిలోని నిర్మల్–భైంసా జాతీయ రహదారిపై మాటేగాం వద్ద బుధవారం స్కూల్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి... ఎగ్గాం నుంచి సుమారు 15 మంది విద్యార్థులతో భైంసా వైపు వెళ్తున్న బ్రిలియన్స్ స్కూల్ బస్సు మాటేగాం వద్దకు రాగానే డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఘటనలో బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎంఈవో సుభాశ్, ఎస్సై సుప్రియ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


