ట్రిపుల్‌ఐటీలో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీలో గందరగోళం

Mar 19 2026 8:46 AM | Updated on Mar 19 2026 8:46 AM

రాత్రంతా వీసీ ఇంటి ఎదుట విద్యార్థుల నిరసన భారీగా పోలీసుల మోహరింపు వీసీకి మద్దతుగా టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది

భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థిని తేజస్విని మృతితో మంగళవారం ప్రారంభమైన విద్యార్థుల నిరసన బుధవారం వరకు కొనసాగింది. ట్రిపుల్‌ఐటీలో వైద్య సేవలు మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించాలన్న డిమాండ్‌తో విద్యార్థులు నిరసనకు దిగారు. మంగళవారం సాయంత్రం నుంచి వీసీ కార్యాలయం వద్ద బైటాయించిన విద్యార్థులంతా రాత్రి వీసీ ఇంటి ముందుకు చేరుకున్నారు. గేటు వద్దే నిద్రించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ట్రిపుల్‌ఐటీకి చేరుకుని భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు.

వినతిపత్రం ఇచ్చిన విద్యార్థులు

బాసర ట్రిపుల్‌ఐటీలో నెలకొన్న సమస్యలపై తెలంగాణ స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఫర్‌ సాలిడారిటీ ఆధ్వర్యంలో వీసీకి వినతిపత్రం ఇచ్చారు. యాజమాన్యం స్పందించి ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘం డిమాండ్‌ చేశారు. ఇందుకు యాజమాన్యం సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్లు తెలిపారు. దీంతో విద్యార్థి సంఘం నిరసనను విరమించింది.

వీసీకి మద్దతుగా..

జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్‌ఐటీలో పనిచేసే టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల జేఏసీ వీసీకి మద్దతుగా నిలిచారు. జేఏసీ బుధవారం సమావేశమై వీసీ గోవర్ధన్‌పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. క్యాంపస్‌ అభివృద్ధి కోసం పని చేస్తున్న వీసీ, ఓఎస్డీలకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.

రాత్రంతా నిరసనలు

పోలీసులు భారీగా మోహరించినా విద్యార్థులు అక్కడే నిరసన కొనసాగించారు. మరోవైపు మంగళవారం రాత్రి ట్రిపుల్‌ఐటీ వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ బయటకు వచ్చి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించినట్లు తెలిసింది. నిరసనకు కూర్చున్న విద్యార్థులు రాజీనామా కోరడంలేదని సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పెంచారన్న ఆరోపణలు వచ్చాయి. జిల్లా ఎస్పీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో కనిపించింది. ఈ వీడియో తాము పోస్టు చేయలేదని విద్యార్థి సంఘం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement