నిర్మల్‌చైన్‌గేట్: ఎంపీవోల ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఐక్యతకు ఇటువంటి వేడుకలు ప్రతీకలని పేర్కొన్నారు. జిల్లాలో తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చూశానని, ఇంత సక్రమంగా, క్రమశిక్షణతో కూడిన ఏర్పాట్లు చూడటం ఆనందంగా ఉందన్నారు. ఏ కార్యక్రమమైనా ఇలా నిర్వహిస్తే చిరస్మరణీయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. గెట్–టు–గెదర్ కార్యక్రమాలు కేవలం విందు కోసం మాత్రమే కా కుండా, అధికారులు, ప్రజల మధ్య ఉన్న దూరాల ను తగ్గించడానికి ఉపయోగపడతాయన్నారు. అధి కారుల మధ్య సత్సంబంధాలు పెంపొందితే జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయని పేర్కొన్నారు. కుల,మత భేదాలు పక్కనపెట్టి, తోటివారికి సహాయం చేయడం ప్రతీ మతం చెప్పే సందేశమన్నారు. జిల్లాలో బతుకమ్మ, రంజాన్, ఉగాది వంటి పండుగలు అన్నివర్గాల ప్రజలు కలిసి జరుపుకోవడం మన సంస్కృతిలోని ఐక్యతకు నిదర్శనమన్నారు. అనంతరం కలెక్టరేట్ మహిళా సిబ్బందికి పంచాయతీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


