కదిలి లోయలో కొలువైన శివుడు
పాపహరేశ్వర దర్శనం.. సర్వపాప హరణం రెండు రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు
దిలావర్‌ఫూర్: జిల్లాలోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో ’కదిలి’ లోయలో కొలువైన శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరుడు భక్తులను ఆకర్షిస్తోంది. దిలవార్‌పూర్ మండలం మాడేగాం మండలం కదిలి అటవీ ప్రాంతంలో ఈ ఆలయం వెలసింది. పరశురాముడు తాను చేసిన మాతృహత్యా పాపం విముక్తి కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని పురాణం. శివుని పక్కనే మాతాన్నపూర్ణ దేవి కూడా ఆవిర్భవించింది. కోరికలు తీర్చే శక్తి ఉందని భక్తుల నమ్మకం.
ఆలయ విశేషాలు
గర్భగుడిలోని శివలింగాన్ని నిశితంగా పరిశీలిస్తే కదులుతున్నట్లు కనిపిస్తుంది. నందీశ్వరుని చెవిలో కోరికలు చెబితే తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఒకే కాండలో 18 వృక్షాలు మిళితమైన వటవృక్షం, అత్తకోడళ్ల గుండాలు, సీతమ్మ అల్లుబండ, ద్వారపాలకులు, సప్తఋషుల ధ్యాన మందిరం ఇక్కడ విశిష్ట ఆకర్షణలు.
చారిత్రక ముద్రలు
చోళులు, కాకతీయుల కాలంలో నిర్మించిన విగ్రహాలు కళానైపుణ్యానికి చిహ్నాలు. ఆవునోటి ద్వారా కోనేరులో చేరే నీరు ఆశ్చర్యకర ఆకట్టుకుంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి ఏటా ఇక్కడికి భక్తుల వస్తారు. సినీ, రాజకీయ ప్రముఖులు రుద్రాభిషేకాలు చేస్తుంటారు. నిర్మల్ నుంచి భైంసాకు రోడ్డు మీద 12 కి.మీ., ఆ తర్వాత 6 కి.మీ. ప్రయాణంతో చేరుకోవచ్చు.
మహాశివరాత్రికి ఏర్పాట్లు
మహాశివరాత్రికి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపనుంది. ఆదివారం తెల్లవారుజామున ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 11 గంటల నుంచి మహాన్యాస అభిషేకం, లింగోద్భవ దర్శనం, శివపార్వతీ కల్యాణోత్సవం జరుగనున్నాయి. సోమవారం అన్నదానం నిర్వహిస్తారు.
ఏర్పాట్లు పూర్తిచేశాం..
శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఆది, సోమవారాలో్‌ల్ జరిగే మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశాం. వివిధ రాష్ట్రలు, పొరుగు జిల్లాల నుంచి వచ్చే భక్తులకు తాగునీరు, వైద్యసేవలు, అన్నదాన సత్రం ఏర్పాటు చేశాం. భక్తులు నిబంధనలు పాటిస్తూ ఆలయ కమిటీ, అధికారుల సూచనలు పాటించి స్వామివారిని దర్శించుకోవాలి.
– నార్వాడి వెంకట్రావు పాటిల్,
ఆలయ కమిటీ చైర్మన్


