పది కాలాలు నిలబడే మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

పది కాలాలు నిలబడే మొక్కలు నాటాలి

Feb 15 2026 12:32 PM | Updated on Feb 15 2026 12:32 PM

పది కాలాలు నిలబడే మొక్కలు నాటాలి

పది కాలాలు నిలబడే మొక్కలు నాటాలి

● డీఆర్డీవో విజయలక్ష్మి

లక్ష్మణచాంద: ఏటా నర్సరీల ద్వారా నాటే మొక్కలు పది కాలాలపాటు నిలబడేలా ఉండాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన 16వ సామాజిక తనిఖీ ప్రజావేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలో చేపట్టిన పనులు, చేసిన ఖర్చులపై తనిఖీ సిబ్బంది నివేదికను సమర్పించారు. అనంతరం డీఆర్డీవో విజయలక్ష్మి మాట్లాడుతూ 2024–25 సంవత్సరంలో మండలంలో 2.82 లక్షల పనిదినాలకుగానూ వేజ్‌ పేమెంట్‌ రూపంలో రూ.4,83,20,880 ఖర్చు చేశామన్నారు. మెటీరియల్‌ పేమెంట్‌ రూపంలో రూ.21,44,378 ఖర్చు చేశామన్నారు. ఈసారి నర్సరీలలో గులాబీ, మందార వంటి మొక్కలు పెంచొద్దని సూచించారు. ఇంటింటికీ పంచే మొక్కలలో తప్పనిసరిగా కరివేపాకు ఉండాలని సూచించారు. వేప, రావి వంటి మొక్కలు ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో ప్రతీ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, వాటి నుంచి రక్షణ పొందేందుకు ముళ్ళతో ఉండే వాక్కాయ మొక్కలను ఈసారి నర్సరీలలో పెంచి గ్రామాలలో సరఫరా చేయాలన్నారు. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పశువుల దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన తొట్టిలను శుభ్రం చేసి వాటిలో నీటిని నింపాలని సూచించారు. మార్జి 25లోపు వీవో భవనాల నిర్మాణం పూర్తిచేయాలని, అందుకు పంచాయతీరాజ్‌ ఏఈ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

యాపల్‌ గూడాను ఆదర్శంగా తీసుకోవాలి...

జిల్లాలో మారుమూల పెంబి మండలం యాపల్‌గూడ గ్రామ పంచాయతీలో గతేడాది పైన్‌ఆపిల్‌ మొక్కలు నర్సరీలో పెంచడం వల్ల అక్కడ లభించిన పైన్‌ఆపిల్‌లను భారత ప్రభుత్వ అధికారులకు ఢిల్లీకి పంపించినట్లు తెలిపారు. ఆ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకుని పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు నర్సరీలలో ప్రత్యేక మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామంలో ఒక పాఠశాలను ఎంచుకొని విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలాగా కిచెన్‌ గార్డె ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే సోమవారం నుంచి ప్రతీ గ్రామంలో ఉపాధిహామీ పథకం కూలీలు హాజరు అయ్యేలా చూడాలని ఆమె క్షేత్ర సహాయకులను ఆదేశించారు. గ్రామంలో తక్కువ శాతం కూలీలు ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన ఆ క్షేత్ర సహాయకుల పైన చర్యలు తీసుకొని షోకాస్‌ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రతీరోజు కూలీలకు రూ.307 తక్కువ కాకుండా చూడాలని సూచించారు.

రూ.5,338 రికవరీ..

మండలంలో 16వ సామాజిక తనిఖీ ప్రజావేదిక సందర్భంగా వడ్యాల్‌ తండా పంచాయతీ కార్యదర్శి రూ.5 వేలు, రాచాపూర్‌ పంచాయతీ కార్యదర్శి, క్షేత్ర సహాయకుడికి రూ.169 చొప్పున మొత్తం రూ.5,338 రికవరీకి ఆదేశించినట్టు ఆమె తెలిపారు. ఇందులో ఎంపీడీవో రాధ, ప్రసాద్‌, ఏపీవో ప్రమీల, సామాజిక తనిఖీ బృంధం సభ్యులు ఉపాధి హామీ పథకం అధికారులు క్షేత్ర సహాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement