నేడు మకరజ్యోతి దర్శనం
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం కర్పూర మకరజ్యోతి దర్శనానికి ముస్తాబైంది. జిల్లాలో సుప్రసిద్ధ శబరిమలై ఆలయం తరహాలోనే పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ గురుస్వామి నర్సారెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం సంక్రాంతి సంబరాలుంటాయని, ఉదయం స్వామివారి సుప్రభాత సేవ అనంతరం విశేషాలంకరణ చేయనున్నట్లు వివరించారు. స్వామివారి ఆభరణాలు, ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్ఠించి గ్రామ వీధుల్లో ఊరేగిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం, ఇక్కడ కర్పూర మకర జ్యోతి దర్శనం ఉంటాయని వివరించారు. రాత్రి మహా పడిపూజ నిర్వహిస్తామని తెలిపారు.


