మోములో చిరునవ్వు
బాల కార్మికుల
లక్ష్మణచాంద: బాలకార్మికులకు విముక్తి కల్పించేందుకు.. చిన్నారుల మోముల చిరునవ్వు చిందించేలా ప్రభుత్వం ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తోంది. వివిధ కారణాల వల్ల చదువులకు దూరమై బాల కార్మికులుగా మారిన పిల్లలను గుర్తించి, వారిని పని నుండి విముక్తి చేసి, తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించి, సమీప పాఠశాలల్లో చేర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది.
20 మంది గుర్తింపు..
జనవరి 1 న ప్రారంభమైన కార్యక్రమంలో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో లేబర్ ఆఫీసర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, పోలీస్ అధికారి, ఎన్జీవో ప్రతినిధి సహా ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఒక బృందం భైంసా డివిజన్‌లో, మరొకటి నిర్మల్ డివిజన్‌లో తనిఖీలు చేపట్టింది. జనవరి 10వ తేదీనాటికి 20 మంది బాల కార్మికులను గుర్తించారు. వీరిలో నిర్మల్ డివిజన్‌లో రెండు కేసులు, బైంసా డివిజన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. అందరినీ పాఠశాలల్లో చేర్చారు.
ఈనెల 31 వరకు...
ఆపరేషన్ స్మైల్ 12వ కార్యక్రమం ఈనెల 31 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ గ్రామాలను సందర్శిస్తూ బాల కార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్టయితే వారిని గుర్తించి పని నుంచి విముక్తులు చేసి బడిబాట పట్టేలా చేస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 20 మంది బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాం.
– దేవి మురళి, డీసీపీవో
పకడ్బందీగా నిర్వహణ..
జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 12వ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 31 వరకు విస్తృతంగా సర్వే చేపట్టి బాల కార్మికులు పనిచేస్తే గుర్తించి వారిని సమీపంలోని పాఠశాలలో చేర్పిస్తున్నాం.
– ఫైజాన్ అహ్మద్, అడిషనల్ కలెక్టర్
ఆరేళ్లలో గుర్తించిన
బాలకార్మికుల వివరాలు...
సంవత్సరం బాలికలు బాలురు మొత్తం
2020 62 72 134
2021 81 162 243
2022 55 83 138
2023 22 45 67
2024 9 71 80
2025 2 64 66
మోములో చిరునవ్వు
మోములో చిరునవ్వు


