గోడు చెప్పి.. గోస తీర్చమని..
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజవాణికి భారీగా అర్జీలు వచ్చాయి. కలెక్టర్ అభిాష అభినవ్ స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. బాధితుల గోడు విన్నారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, స్పందించాలన్నారు. ముఖ్యంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సంబంధిత శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజావాణికి విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి.
పరిహారం అందించాలి
ఐదు నెలల క్రితం ఎంపీపీఎస్ అంతర్నీ పాఠశాలలో చదువుతున్న నా కుమారుడిపై ప్రమాదవశాత్తు స్కూల్ గోడ కూలి గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అప్పట్లో అధికారులు పరిహారం కింద రూ.25 వేలు ఇస్తానని మాట ఇచ్చారు. నేటికీ ఆ పరిహారం అందలేదు. –రాజేశ్వర్, కుభీర్
సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి..
సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 16న జిల్లాకు రానున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం, నివేదికలతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి పూర్తి చేయించాలన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అటల్ పెన్షన్ యోజన’ అమలులో జిల్లా 107 శాతం నమోదు సాధించినందుకు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్‌ను కలెక్టర్ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గోడు చెప్పి.. గోస తీర్చమని..


