క్షయపై అవగాహన ఉండాలి
సారంగపూర్: క్షయ వ్యాధిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం.ప్రత్యూష అన్నారు. టీబీ ముక్త్‌భారత్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చించోలి(బి) గ్రామంలో క్షయవ్యాధిపై శుక్రవారం అవగాహన కల్పించారు. వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించి 65 మందికి డిజిటల్ ఎక్స్‌రే తీయించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నవారు టీబీపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, దగ్గినప్పుడు రక్తం పడడం, అలసట, నీరసం, గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడినవారు ఛాతి నొప్పి, శరీరంలో ఏభాగంలోనైనా వాపు లాంటి లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్‌రే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేయించుకోవాలని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు అందజేస్తారన్నారు.


