బాధితులకు సత్వర న్యాయం చేయాలి
భైంసాటౌన్: పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భైంసా సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల నుంచి వచ్చిన 11మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి ఎదుటే సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. అనంతరం భరోసా కేంద్రం చేస్తున్న కృషిని పరిశీలించారు. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం కౌన్సిలింగ్ ద్వారా తిరిగి కలుసుకునేలా చేస్తున్నామని చెప్పారు. గత గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, పెండింగ్ ఫిర్యాదుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏఎస్పీ రాజేశ్ మీనా ఉన్నారు.


