
నవోదయకు 6,091 దరఖాస్తులు
కాగజ్‌నగర్ టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యాలయం అన్ని వసతులతో పాటు క్రమ శిక్షణతో కూడిన నాణ్యమై న విద్యకు మారుపేరుగా నిలుస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు గాను విద్యార్థుల నుంచి ఈ నెల 27 వరకు www. navodaya. gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 6,091 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3,003 మంది బాలికలు, 3,088 మంది బాలుర దరఖాస్తులున్నాయి. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నవోదయలో ఆరోతరగతిలో ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తుల వివరాలు
చెన్నూరు నుంచి 274 దరఖాస్తులు వచ్చినట్లు అధి కారులు తెలిపారు. ఖానాపూర్ నుంచి 287, మంచి ర్యాల నుంచి 510, కాగజ్‌నగర్ నుంచి 631, సిర్పూ ర్ నుంచి 378, ఆదిలాబాద్ నుంచి 571, బెల్లంపల్లి నుంచి 270, బోథ్ నుంచి 319, నిర్మల్ నుంచి 590, భైంసా నుంచి 664, లక్సెట్టిపేట్ నుంచి 350,మందమర్రి నుంచి 279, ఉట్నూర్ నుంచి 377, ఆసిఫాబాద్ నుంచి 591 వచ్చినట్లు పేర్కొన్నారు.
త్రిభాషా విధానం అమలు
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యార్థులు ఐదో తరగతి చదివి ఉండాలి. వరుసగా 3, 4, 5 తరగతులు ఒకే పాఠశాలలో చదివినవారే అర్హులు. విద్యార్థులు మే 1, 2014 నుంచి జూలై 31, 2016 మధ్యలో జన్మించి ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో త్రిభాషా విధానం ప్రాతిపదికన జాతీయ సమైక్యతకు బాటలు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు సోపానంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు బాలబాలికలకు వేర్వేరుగా డార్మెటరీలు, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు క్వార్టర్లు వంటి వసతులున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, ఆరోగ్యాన్ని పంచే హరిత సంపద, సుశిక్షితులైన అధ్యాపకులు, స్మార్ట్ క్లాసులు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, ఆటలకు బాసటగా విశాలమైన స్టేడియం, బాస్కెట్‌బాల్ తదితర మైదానా లు జిమ్, హెల్త్‌సెంటర్‌లతో నవోదయ ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ పుస్తకాలు, దుస్తులు సహా విద్యార్థులకు అన్నీ ఉచితమే. 6, 7 తరగతులకు మాతృబాషలో బోధిస్తారు. 8వ తరగతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన చేస్తారు.