
గణపయ్యకు 32 రూపాలు
హిందూ పురాణాల ప్రకారం గణపతి సకల దేవతలకు అధిపతి. పూజ ఏదైనా ముందుగా గణపతినే పూజిస్తారు. ప్రతీ శుభకార్యాన్ని వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు. అనాధిగా వస్తున్న సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. హిందూ సంప్రదాయాల్లో ఇంటిని నిర్మిస్తే ప్రధాన ద్వారానికి గణపతిని ప్రతిష్ఠిస్తారు. ఉదయం లేవగానే నీటితో కడిగి పూజించి వెళ్తారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలోనూ ప్రధాన ద్వారంలో ఉన్న గణపతికి నమస్కరిస్తారు. తిరిగి వస్తూ మళ్లీ గణపతికి నమస్కరించాకే ఇంటిలోకి వెళ్తారు. ఏ ఆలయం నిర్మించినా ముందుగా గణపతి పూజలు చేస్తారు. గణపతి హోమాలు నిర్వహిస్తారు. ఇలా అందరికీ గణాధిపతి అయిన స్వామివారికి ముద్గల పురాణంలో 32 స్వరూపాలను వర్ణించారు. ఈ 32 స్వరూపాల్లో 16 రూపాలు అత్యంత ప్రాశస్థ్యమైనవి.
పురాణాల్లో పేర్కొన్న రూపాలు
పురాణాల్లో వినాయకుడికి 32 స్వరూపాలుగా పేర్కొన్నారు. ఇందులో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనమని తెలిపారు. నేటి రోజుల్లో కళాకారులు గణపయ్యను అనేక రూపాల్లో మలుస్తున్నారు. ఈ 16 రూపాల్లో ఉన్న గణనాథులకు పూజలు చేస్తే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో పేర్కొన్నట్లు బాలగణపతి, తరుణగణపతి, ఉచ్చిష్టగణపతి, విఘ్నగణపతి, మహాగణపతి, క్షిప్రగణపతి, హేరంబగణప తి, లక్ష్మీగణపతి, భక్తిగణపతి, వీరగణపతి, శక్తిగణపతి, ద్విజగణపతి, సిద్ధగణపతి, నృత్యగణపతి, ఊర్ధ్వగణపతి, విజయగణపతి.. ఇలా 16 ప్రధానమైన రూపాలున్నాయి.