
కేజీబీవీల్లో ‘పోలీస్ అక్క’
నిర్మల్‌టౌన్: కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్నవారంతా పేద, మధ్య తరగతి కుటుంబలకు చెందిన బాలికలే. గ్రామీణ ప్రాంతా ల్లో, అణగారిన వర్గాల్లో లింగ అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీనిని నివారించేందుకు నిర్మల్ పోలీస్.. మీ పోలీస్.. అంటూ ఎస్పీ జానకీ షర్మిల పోలీస్ అక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. ఇందులో భాగంగా ఆడపిల్లల సమస్యలను దగ్గరుండి అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే తొలిసారి జిల్లాలోని 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఒక్కో పాఠశాలలను ఒక్కో మహిళ కానిస్టేబుల్ దత్తత తీసుకున్నారు.
రాత్రి బస..
మహిళా పీసీలు విద్యార్థులతో కలిసి రాత్రి బస చేస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విద్యార్థినిలతో కలిసి బస చేశారు. వారితో కలిసి ముచ్చటించారు. వారితో కలిసే భోజనం చేశారు. సమస్యలు తెలుసుకున్నారు. వార్షిక పరీక్షల గురించి చర్చించారు. పరీక్షలు ఎలా రాయాలి.. ఎలా ప్రిపేర్ కావాలి.. అనే విషయాలు తెలియజేశారు. విద్యార్థినుల్లో ధైర్యం నింపారు.