‘దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’
జన్నారం: అడవి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకోగా విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జన్నారం అటవీ డివిజన్, ఇందన్‌పల్లి రేంజ్ భర్తన్‌పేట్ బీట్ అధికారి రుబీనా తలత్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఎఫ్‌ఎస్‌వో హన్మంతరావుతో కలిసి మాట్లాడారు. ఈనెల 4న భర్తన్‌పేట్ బీట్ పరిధిలో విధుల్లో భాగంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకోగా ఎజాజోద్దీన్ అనే వ్యక్తి తనను దుర్భాషలాడారన్నారు. ట్రాక్టర్‌ను రేంజ్‌కు తరలిస్తుండగా కొత్తపేట్ గ్రామ సమీపంలో అడ్డం తిరిగి రియాజోద్దీన్ అనే మరో వ్యక్తి తన చేయి పట్టుకొని లాగడంతో పాటు కర్రతో కొట్టినట్లు తెలిపారు. అడ్డు వచ్చిన తన భర్త అఫ్రోజ్‌పై కూడా ఇద్దరు దాడి చేసి గాయపర్చినట్లు పేర్కొన్నారు. కాగా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజవర్దన్ ఇద్దరిపై కేసు నమోదు చేశారు.


