ఐడియా టవరంటూ టోకరా●
● రూ.72,600 మోసపోయిన బాధితులు
ముధోల్: వ్యవసాయ భూమిలో ఐడియా టవర్ ఏర్పాటు చేసుకుంటే రూ.25 లక్షలు ఇస్తామని ఫోన్‌లో మాయమాటలు చెప్పి రూ.72600లు కాజేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామానికి చెందిన బాధితుడు సత్తి రాములు, భార్య లలితలకు ఈనెల 2వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసి పంట పొలంలో ఐడియా టవర్ ఏర్పాటు చేసుకుంటే కంపెనీ ద్వారా రూ.25లక్షలు అందజేస్తామన్నారు. అయితే బాండ్ రూపొందించేందుకు ముందుగా డబ్బులు కట్టాలని తెలిపారు. దీంతో బాధితులు విడతల వారీగా 3, 4వ తేదీల్లో మొత్తం రూ.72,600 చెల్లించారు. దీంతో సత్తి రాములు పేరుమీదుగా రూ. 25లక్షల 11 పేజీల బాండ్ పంపించారు. అనంతరం వారి నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో మోసపోయినట్లుగా గుర్తించి బాధితులు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కేసు
కాగజ్‌నగర్‌రూరల్: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున సిర్పూర్ మార్కెట్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న 13 మందిని, బోలోరో వాహనాలను పట్టుకున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా చిల్వకొండూరు గ్రామానికి చెందిన సిరాజ్, రియాజ్, సాజిద్, పెద్దపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన పైదిపాల రవి, జగిత్యాల జిల్లా రామడామినిపెల్లి గ్రామానికి చెందిన గుంటకుల మహేందర్, చింతకొండి స్వామి, కోష్టపల్లి గ్రామానికి చెందిన గుంటకుల రమేశ్, రామడామినిపెల్లి గ్రామానికి మటేటి మహేందర్, మటేటి రాము, దమ్మమ్మపేట గ్రామానికి ఉప్పడ నర్సయ్య, పెద్దపల్లి జిల్లా నందిమేడారం గ్రామానికి చెందిన ఆవునూరి తిరుపతి, బంజారపల్లి గ్రామానికి చెందిన నూనవత్ సంతోష్, బంజారపల్లి గ్రామానికి చెందిన ఎస్లావత్ జితేందర్‌లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుకున్న పశువులను త్రిశూల్‌పహాడ్ గోశాలకు తరలించామన్నారు.


