సీతారాముల కల్యాణం.. చూతము రారండి
అడుగడుగునా రాముడు..
‘శ్రీరాముడుండని ఇల్లు లేదు, రామాలయం లేని ఊరు లేదు..’ అన్నట్లుగా జిల్లావ్యాప్తంగా ప్రతీ మండలంలో సీతారాములు కొలువుదీరి ఉన్నారు. శ్రీరామ నవమి పర్వదినానికి ఈ ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. పండుగరోజు పొద్దున్నుంచే భక్తులు సీతారాముల దర్శనాలు చేసుకుంటారు. ఉత్సవమూర్తులతో మధ్యాహ్నం వరకూ కొనసాగే కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి, ఆలయాల్లోనే అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించి ఆలయకమిటీలు అన్నిఏర్పాట్లు పూర్తిచేశాయి.
జిల్లాకేంద్రంలో..
నిర్మల్‌టౌన్: శ్రీరామనవమి ఉత్సవానికి జిల్లాకేంద్రంలోని రామాలయాలలో ఏర్పాట్లు పూర్తిచేశారు.
● బాగులవాడ వాల్మీకినగర్ రామాలయంలో ఈసారి ఆలయకమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇంట్లో వివాహానికి ఎలాగైతే ఏర్పాట్లు చేస్తామో అలాగే.. రాములోరి పెళ్లికి పందిరి, పసుపుదంచడం తదితర కార్యక్రమాలన్నీ చేశారు. కల్యాణానికి భారీగా విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నిఏర్పాట్లు చేశారు.
● బ్రహ్మపురి రాంమందిర్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు తడకలతో నిర్మించబడి, చెక్క విగ్రహాలకు పూజలు చేయబడిన ఆలయమిది. 1980లో ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
● శాంతినగర్ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో సీతారాముల కల్యాణోత్సవం కనులపండువగా సాగనుంది. కామోల్ రామాలయంలో.
భైంసారూరల్: మండలంలోని కామోల్ గ్రామంలో దాదాపు 300 ఏళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది నుంచి నవమి వరకు కొనసాగుతాయి. వందల ఏళ్లక్రితం ఇక్కడ కొలువైన సీతారాముల కల్యాణమూ అంగరంగవైభవంగా సాగుతుంది.
‘శ్రీరామ్’నగర్‌లో..
ఖానాపూర్: పట్టణంలో రాముడి పేరుమీదుగా గల శ్రీరామ్‌నగర్ కాలనీ సీతారామాంజనేయ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
చామన్‌పల్లిలో రాములోరి పెళ్లి..
లక్ష్మణచాంద: మండలంలోని చామన్‌పల్లిలో గ్రామస్తులంతా సమష్టిగా శ్రీరామనవమి వేడుకను ఘ నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చలువపందిళ్లు వేసి, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు.
జామ్‌లో ‘పట్టాభిరాముడు’..
సారంగపూర్: మండలంలోని జామ్ రామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ శ్రీరాముడు సకుటుంబ సపరివారసమేతంగా పట్టాభిరాముడిగా కొలువుదీరడం విశేషం. శ్రీరామనవమికి స్థానికులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
రాంపూర్ రామయ్య...
నిర్మల్: నర్సాపూర్(జి) మండలంలోని రాముడి పేరుతో వెలిసిన రాంపూర్‌లో గ్రామంలోని రామాలయంలో నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. మండలకేంద్రంలోని శ్రీరామాలయం సైతం స్వామివారి కల్యాణోత్సవానికి ముస్తాబైంది.
పరిమండల్‌లో..
మామడ: మండలంలోని పరిమండల్‌లో నూతనంగా నిర్మించిన రామాలయంలో కొలువుదీరిన సీతారాములు కల్యాణోత్సవానికి ముస్తాబయ్యారు.
కడెం ఒడ్డున కొలువైన రాముడు..
కడెం: మండలకేంద్రంలోని కడెం ప్రాజెక్టు దిగువన సీతారాముడు కొలువై ఉన్నాడు. ఏళ్లుగా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పండుగ కోసం అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు.
శ్రీరామ్‌సాగర్ దిగువన..
సోన్: మండలంలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు దిగువన పాత(లెఫ్ట్)పోచంపాడ్ గ్రామంలోని పురాతన రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. చలువపందిళ్ల కింద స్వామివారి పెళ్లికి ముస్తాబుచేశారు.
రాములోరి పెళ్లికి ముస్తాబైన ఆలయాలు
ఊరూరా జరగనున్న కళ్యాణ వేడుకలు
నిర్మల్, భైంసాలో శోభాయాత్రలు
భారీ బందోబస్తుకు సిద్ధమైన పోలీసులు
‘శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి..’ అంటూ రాములోరి పెళ్లి చూసేందుకు జిల్లా సిద్ధమైంది. జగదభిరాముడి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు రామాలయాలను ముస్తాబు చేశారు. ఊరంతా వీక్షించేందుకు వాడంతా చలువ పందిళ్లు వేశారు. ఇప్పటికే కొత్తరంగులద్దుకుని, విద్యుల్లతలతో రామాలయాలు కాంతులీనుతున్నాయి. హిందూ సంస్థల ఆధ్వర్యంలో నిర్మల్, భైంసాల్లో భారీ శోభాయాత్రలను చేపట్టనున్నారు. ఈమేరకు పోలీసులూ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. – నిర్మల్/నెట్‌వర్క్
నిర్మల్, భైంసాలో శోభాయాత్రలు..
శ్రీరామనవమి పురస్కరించుకుని హిందూవాహిని, బజరంగ్‌దళ్ తదితర హిందూసంస్థలు కొన్నేళ్లుగా శోభాయాత్రలు నిర్వహిస్తున్నాయి. జిల్లాకేంద్రంలో ప్రతీసారి శ్రీరామనవమి, హనుమాన్ జనోత్సవాలకు హిందూవాహిని, బజరంగ్‌దళ్ సంస్థలు వేర్వేరుగా శోభాయాత్రలు చేపట్టేవి. ఈసారి నవమి రోజున ఒకేసారి రెండుసంస్థలు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. స్థానిక దేవరకోట నుంచి ప్రారంభమయ్యే ర్యాలీలో బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి పాల్గొననున్నారు. భైంసాలో చేపట్టనున్న ర్యాలీలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే రామారావుపటేల్ తదితరులు హాజరుకానున్నారు. రెండుచోట్లా ఉదయమే ర్యాలీలను నిర్వహించనున్నారు. జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలు, భారీ ర్యాలీల నేపథ్యంలో పోలీసులూ అలర్ట్ అయ్యారు. ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తిచేసుకునేందుకు అందరూ సహకరించాలని ఎస్పీ జానకీషర్మిల కోరారు.
సీతారాముల కల్యాణం.. చూతము రారండి


